Begin typing your search above and press return to search.

ఏ క్షణంలో అయినా ఏపీలో ఎన్నికలు? ఆ మాట చెప్పిందెవరంటే?

By:  Tupaki Desk   |   2 March 2022 10:32 AM GMT
ఏ క్షణంలో అయినా ఏపీలో ఎన్నికలు? ఆ మాట చెప్పిందెవరంటే?
X
సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీడీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తాజాగా జరిగిన పార్టీ కార్యక్రమంలో నేతలు.. కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉందని.. ఏ క్షణంలో అయినా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి వచ్చే సీట్ల సంఖ్య గురించి చెప్పుకోవటం గమనార్హం.

ఎన్నికల్ని ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నట్లుగా చెబుతున్న అచ్చెన్న.. నేతలు.. కార్యకర్తలు సిద్దంగా ఉండాలన్నారు. క్రిష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో తెలుగురైతు విభాగం ఆధ్వర్యంలో జరిగిన పార్టీ వర్కు షాపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్ సర్కారుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

రైతులను జగన్ ప్రభుత్వం అడుగడుగునా ముంచిందన్న ఆయన.. రాష్ట్రంలోని ప్రతి రైతును రైతు విభాగం నేతలు కలవాలన్నారు. మాజీ మంత్రి వివేకా హత్య ద్వారా వచ్చిన సానుభూతితో సీఎంగా జగన్ ఎన్నికయ్యారన్న అచ్చెన్న.. హత్య కేసు నిందితులను ఎందుకు శిక్షించటం లేదని ప్రశ్నించారు. జగన్ సర్కారు మీద ఏపీ ప్రజల్లో ఇప్పుడున్నంత వ్యతిరేకత మరెప్పుడూ లేదన్నారు.

ఒకవైపు అచ్చెన్న వ్యాఖ్యలు సంచలనంగా మారితే.. మరోవైపు సీనియర్ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసును జగన్ ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తుందన్నారు. జగన్ సకుటుంబ సపరివార సమేతంగా చేసిన కుట్ర ఫలితమే వివేక హత్యగా ఆయన అభివర్ణించారు. ఈ హత్య కేసులో సాక్ష్యులను బెదిరిస్తున్నారని.. జగన్ పాలనలో రాష్ట్రంలో అంతులేని ఆరాచకాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ ను ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించిన గోరంట్ల.. రాష్ట్ర పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు.