Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు బాట‌లో అచ్చెన్న‌

By:  Tupaki Desk   |   20 July 2016 11:25 AM GMT
చంద్ర‌బాబు బాట‌లో అచ్చెన్న‌
X
ఆర్థిక‌లోటుతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ను దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిల‌బెట్టాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. ఈ క్ర‌మంలో ఆయ‌న పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేందుకు ఆదేశం ఈ దేశం అని లేకుండా అన్ని దేశాల‌కూ తిరుగుతున్నారు. అంది వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని - పెట్టుబ‌డులు పెట్టేలా ఆయా కంపెనీల‌ను ఒప్పిస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న చైనా ప‌ర్య‌ట‌న‌లో దాదాపు రూ.58 వేల కోట్ల ఒప్పందాల‌ను రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే.

మ‌రి రాష్ట్రం కోసం త‌మ అధినేత - సీఎం చంద్ర‌బాబు ఈ రేంజ్‌ లో క‌ష్ట‌ప‌డుతుంటే.. మిగిలిన మంత్రులు ఊరుకుంటారా? వారూ చంద్ర‌బాబు బాట‌లోనే న‌డుస్తున్నారు. ఇప్ప‌టికే ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు - నారాయ‌ణ‌ - ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పరకాల ప్రభాకర్‌ సీఎం వెంట ఆయా దేశాల‌కు వెళ్తూ పెట్టుబ‌డులు ర‌ప్పించేందుకు త‌మ వంతుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అదేవిధంగా సీఎం త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కూడా గతంలో అమెరికాలో పర్యటించి పెట్టుబ‌డులు ర‌ప్పించేందుకు త‌న వంతుగా కృషి చేశారు.

ఇక‌, ఇప్ప‌డు ఈ జాబితాలో చేరి - తాను కూడా చంద్ర‌బాబు బాట‌నే న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. మలేసియాలో ‘ఆసియాన్- ఇండియా బిజినెస్ లీడర్ షిప్ సమ్మిట్’ పేరిట జరగనున్న వాణిజ్య సదస్సులో ఆయన ఏపీ ప్రతినిధిగా పాల్గొంటున్నారు. ఈ స‌ద‌స్సులో ఏపీ విశేషాల‌ను వివ‌రించాల‌ని తద్వారా ఏపీలో వాణిజ్యానికి ఉన్న అవ‌కాశాల‌ను ఫోక‌స్ చేయాల‌ని ఆయ‌న ప‌క్కా ప్లాన్‌ తో సిద్ధ‌మ‌య్యారు.

ఫ‌లితంగా వాణిజ్య రంగంలో ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేవారికి ఆహ్వానం ప‌ల‌కాల‌ని ఆయ‌న యోచ‌న‌. దీనికి సంబంధించి ఆయ‌న మంగ‌ళ‌వార‌మే మ‌లేసియా బ‌య‌లుదేరారు. మంత్రి వెంట ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈఓ కృష్ణకిశోర్ - పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్ వెళ్లారు. ఏదేమైనా.. చంద్ర‌బాబు బాట‌లో న‌డుస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుప‌డుతున్న మంత్రుల‌ను అభినందించాల్సిందే.