Begin typing your search above and press return to search.

ట్యూషన్లకు పోతామంటున్న మంత్రులు

By:  Tupaki Desk   |   14 Sep 2016 7:56 AM GMT
ట్యూషన్లకు పోతామంటున్న మంత్రులు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక ప్యాకేజీని స‌మ‌ర్థించే క్ర‌మంలో అధికార తెలుగుదేశం పార్టీ నేత‌లు ప్ర‌తిప‌క్షాల‌పై దూకుడు మొద‌లుపెట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదా ద్వారా రూ.60 వేల కోట్లు వస్తాయని చెబుతున్న కాంగ్రెస్‌ కు చెందిన మాజీ కేంద్ర మంత్రి జైరామ్‌ రమేష్‌ పై రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా జైరామ్ మాట‌లు ఉన్నాయ‌న్న అచ్చెన్నాయుడు... స‌ద‌రు నిధులు ఏ విధంగా వస్తాయో సమగ్రంగా వివరిస్తే ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడుతో పాటు స‌హా సహచర మంత్రుల‌మైన తాము తెలుసుకుంటామని అన్నారు.

ఆంధ్ర‌ప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విష‌యంలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రకటనలు చేయడం ఎంత మాత్రం సబబు కాదని అచ్చెన్నాయుడు అన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్ర‌త్యేక హోదా బిల్లు పెట్టి ఉంటే ఇప్పుడు ఈ సమస్యలు ఉత్పన్నమయ్యేవి కావ‌ని వ్యాఖ్యానించారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా పోలవరం ప్రాజెక్టు ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తానంటే తీసుకోవడం తప్పా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఈ అంశంపై వైకాపా - ఇతర పార్టీలు ముఖ్యమంత్రిపై అర్థం లేని ఆరోపణలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు. వారు చేత‌గాని వారు, అభివృద్ధి నిరోధ‌కుల‌ని మండిప‌డ్డారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో విపక్ష నేత వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి - వారి ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలు గుర్తించారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు వేదిక అయిన అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత‌లు ప్ర‌వ‌ర్తించిన తీరును అంతా గ్రహించారని ఆయ‌న తెలిపారు.

మరోమంత్రి పత్రిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ ఇదే రీతిలో స్పందించారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ బాగుందని చెప్పారు. ప్యాకేజీ కన్నా ప్రత్యేకహోదా ద్వారా ఇంకేమి వస్తాయో ఎవరైనా ప్రభుత్వానికి వివరిస్తే. అవి కూడా కేంద్రం నుంచి తెప్పించేందుకు ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు. ప్రతిపక్ష నేత తీరువల్ల అసెంబ్లీ అంటేనే చీదరించుకు నే పరిస్థితి వచ్చిందని అన్నారు. అసెంబ్లీలో వ్యవహరించిన తీరుచూస్తే జగన చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని విమర్శించారు. స్విస్ చాలెంజ్‌పై వచ్చిన కోర్టు స్టేపై అప్పీల్‌ కు వెళ్తామని చెప్పారు.