Begin typing your search above and press return to search.

అచ్చెన్నాయుడికి మళ్లీ పెద్దరికం

By:  Tupaki Desk   |   23 Nov 2016 5:59 AM GMT
అచ్చెన్నాయుడికి మళ్లీ పెద్దరికం
X
ఇటీవల కొద్దికాలంగా చంద్రబాబుతో చీవాట్లు తింటున్న అచ్చెన్నాయుడికి సీఎం మళ్లీ ఇంకో పెద్ద బాధ్యత అప్పగించారు. ప్రాబ్లం సాల్వింగ్ లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న అచ్చెన్నాయుడి సామర్థ్యాలపై చంద్రబాబు నమ్మకం పెట్టుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. రాయలసీమలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలను చల్లార్చే పెద్ద బాధ్యతను ఆయన అచ్చెన్నాయుడికి అప్పగించారు. ముఖ్యంగా కర్నూలులో భూమా నాగిరెడ్డి - శిల్పా మోహనరెడ్డి వర్గాల మధ్య విభేదాలు రోజురోజుకీ తీవ్రమవుతున్న తరుణంలో చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

నిజానికి సీనియర్ లీడర్ల మధ్య విభేదాల పరిష్కారానికి స్వయంగా చంద్రబాబే చొరవ చూపుతారు. ఇటీవల కాలంలో చిన్నబాబు లోకేశ్ కూడా అలాంటివాటిలో వేలుపెడుతున్నారు. భూమా - శిల్పాల గొడవలోనూ చంద్రబాబు ఇప్పటికే ఒకట్రెండు సార్లు ఇద్దరినీ పిలిచి మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. మరోవైపు ఎందుకనో తెలియదు కానీ లోకేశ్ ఈ వ్యవహారంలో వేలు కాదు కదా గోరు కూడా పెట్టలేకపోయారని టాక్. ఈ పరిస్థితిల్లో సీమలో సంక్షోభాన్ని నిలువరించేందుకు అచ్చెన్నాయుడికి చంద్రబాబు దిశానిర్దేశం చేసి వదిలినట్లు తెలుస్తోంది.

జడ్పీ సమావేశాల నుంచి - అభివృద్ధి కార్యక్రమాల వరకూ వీరి మధ్య ప్రొటోకాల్ గొడవలు - కార్యకర్తల స్థాయిలో ఆగ్రహావేశాలు - ఫ్యాక్షన్ రాజకీయాలు జరుగుతుండగా, ఈ గొడవలు పార్టీకి నష్టం కలిగిస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పార్టీని చక్కదిద్దే బాధ్యతలను మంత్రి అచ్చెన్నాయుడికి ఆయన అప్పగించారు. అచ్చెన్నాయుడు గతంలో ముద్రగడ కాపు ఉద్యమం ప్రారంభించి తన ఇంట్లో భీష్మించుకు కూర్చున్నప్పుడు కూడా ఆయన్ను తన మాటలతో మెత్తబెట్టేసి దీక్ష విరమించేలా చేశారు. ఆ నమ్మకంతోనే ఇప్పుడు భూమా - శిల్పాల గొడవ సెటిల్ చేయడానికి అచ్చెన్నను రంగంలోకి దించారు.

అంతా బాగానే ఉన్నా ఉత్తరాంధ్రలో మరో మంత్రి గంటా శ్రీనివాసరావుతో అచ్చెన్నాయుడికి పెద్ద యుద్ధమే నడుస్తోంది. మరి వారిద్దరి సమస్యను పరిష్కరించడానికి ఎవరు రావాలో ఏమో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/