Begin typing your search above and press return to search.

అచ్చెన్నాయుడు మాటల్ని సీరియస్‌గా తీసుకోవాలా?

By:  Tupaki Desk   |   11 Jun 2015 6:13 AM GMT
అచ్చెన్నాయుడు మాటల్ని సీరియస్‌గా తీసుకోవాలా?
X
ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన రేవంత్‌రెడ్డి వీడియో సీడీ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు చెందిన ఆడియో సీడీ బయటకు రావటం తెలిసిందే. దీని మీద నానా రచ్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర సర్కారు తమ ఫోన్లను ట్యాప్‌ చేసిందంటూ ఏపీ అధికారపక్షం పదే పదే ప్రస్తావించటం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి మరో ఆసక్తికర అంశాన్ని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడిస్తున్నారు.

ఏపీ సర్కారుకు చెందిన వారి ఫోన్లు ట్యాప్‌కు గురయ్యారని ఆరోపించిన ఆయన.. ఏపీ నేతలే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరికొందరు ప్రముఖుల ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు ఆరోపించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాటల ప్రకారం.. తెలంగాణ సర్కారు తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం.. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన షబ్బీర్‌ అలీతో పాటు విమలక్క.. మరికొందరు ఉద్యమ నాయకులు.. జర్నలిస్టులతో పాటు ఉస్మానియా వర్సిటీలోని పలువురు విద్యార్థి సంఘాల నేతల ఫోన్లు ట్యాప్‌ అవుతున్నట్లు ఆరోపించి సంచలనం సృష్టించారు.

అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణల్లో నిజం ఎంతన్నది తేలాల్సి ఉంది. తాము ఎవరి ఫోన్లను ట్యాప్‌ చేయలేదని ఇప్పటికే పలుమార్లు తెలంగాణ అధికారపక్ష నేతలు చెప్పటం తెలిసిందే. స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌సైతం ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై స్పందిస్తూ.. తాము అలాంటివి చేయలేదని స్పష్టం చేస్తున్నారు. మరి.. తెలంగాణ అధికారపక్షంపై టెలిఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి ఇప్పటివరకూ ఆరోపణలు చేసే బదులు అందుకు తగ్గ ఆధారాల్ని శాంపిల్‌గా ఏపీ సర్కారు విడుదల చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోపణలకు ఎవరు మాత్రం ప్రాధాన్యత ఇస్తారు అచ్చెన్నాయుడు..!