Begin typing your search above and press return to search.

దీక్ష చేసిన వ్య‌క్తి ప‌క్క‌న దంపుడు ప్ర‌సంగాలా?

By:  Tupaki Desk   |   9 Feb 2016 4:17 AM GMT
దీక్ష చేసిన వ్య‌క్తి ప‌క్క‌న దంపుడు ప్ర‌సంగాలా?
X
కాపుల్ని బీసీల్లోకి చేర్చాలంటూ మాజీ మంత్రి.. కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష విరమణ సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. నాలుగు రోజుల పాటు నీళ్ల చుక్క తీసుకోకుండా దీక్ష చేసిన ముద్రగడ.. ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో గంటన్నర సేపు చర్చలు జరిపిన అనంతరం.. తాను చేస్తున్న దీక్షను విరమిస్తున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముద్రగడను పక్కన పెట్టుకొని మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.

నాలుగు రోజుల పాటు దీక్ష చేసిన వ్యక్తి ఎంతగా నీరసించిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. అలాంటి వ్యక్తికి తక్షణమే వైద్య సాయం అవసరమన్న విషయం మర్చిపోకూడదు. ఆ మధ్యన ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన దీక్షను గుర్తు తెచ్చుకుంటే ఆయన ఎంతగా బలహీనమైపోయారో చూసిందే. దీక్షను భగ్నం చేసే సమయంలో ఆయన నడవలేని స్థితి ఉంటే.. ఆయన్నుఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య చికిత్స చేసిన కొన్ని గంటల తర్వాత కానీ ఆయన మామూలు కాలేదు.

మరి.. జగన్ తో పోలిస్తే వయసులో పెద్ద అయిన ముద్రగడ పద్మనాభం నాలుగు రోజులు దీక్ష చేసిన తర్వాత ఎంతగా నీరసించిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఆయన్ను పక్కన నిలబెట్టుకొని.. దాదాపు పావు గంటకు పైగా అచ్చెన్నాయుడు ఉకదంపుడు ప్రసంగం చేయటం పలువురిని విస్మయానికి గురి చేసింది. తాము సాధించిన విజాయన్ని గొప్పగా చెప్పుకోవాలంటే కనీసం ముద్రగడను కూర్చోబెట్టి అయినా మాట్లాడాల్సింది. అదేమీ లేకుండా.. తమ ప్రభుత్వానికి ఉన్న కమిట్ మెంట్ ను వివరించే క్రమంలో అప్పటివరకూ ముద్రగడ ఆమరణ దీక్ష చేసిన విషయాన్ని పట్టించుకోకుండా నాన్ స్టాప్ గా మాట్లాడేసిన అచ్చెన్న తీరు కాస్త షాకింగ్ గా అనిపించక మానదు.