Begin typing your search above and press return to search.

అచ్చెన్నాయుడి సలహా బాబుకు లాభమేనా?

By:  Tupaki Desk   |   29 Nov 2015 11:30 AM GMT
అచ్చెన్నాయుడి సలహా బాబుకు లాభమేనా?
X
కొద్ది రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుద్ధిగా ఏపీలో తన పని తాను చేసుకుంటూ.. తన ఫోకస్ అంతా ఏపీ రాష్ట్రం మీదనే చెప్పారు. గతంలో చెప్పినట్లుగా వారానికి రెండు రోజులు హైదరాబాద్ లో మకాం అన్న మాటను మర్చిపోయి.. తన మొత్తం మనసును ఆంధ్రాకే పరిమితం చేశారు. తాజాగా.. ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. కొద్ది నెలల అనంతరం.. శనివారం హైదరాబాద్ లోని ఏపీ సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి.. అక్కడ అధికారులతో సమావేశమయ్యారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక సలహా ఇచ్చారు. చంద్రబాబు వారానికి రెండు రోజులు హైదరాబాద్ లో ఉండాలని సూచించారు. ఆయన హైదరాబాద్ లో ఉండాలని తెలంగాణ తెలుగుదేశం నేతలతో పాటు.. సీమ ప్రాంత ప్రజలు కూడా కోరుకుంటున్నారని.. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయటంతో పాటు.. రానున్న రోజుల్లో గ్రేటర్ ఎన్నికల మీద ఫోకస్ చేయటం కోసం హైదరాబాద్ లో ఉండాలని కోరుతున్నారు.

మరి.. మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు చంద్రబాబు హైదరాబాద్ లో ఉండటం మంచిదేనా? అన్న ప్రశ్న వేసుకుంటే.. అంతకంటే పెద్ద తప్పు మరొకటి ఉండదని చెబుతున్నారు. వారానికి రెండు రోజులు హైదరాబాద్ లో ఉంటే.. దాని ప్రభావం తెలంగాణ రాజకీయాల మీద పడుతుంది. అదే జరిగితే.. తమ పుట్టలో వేలు పెట్టే చంద్రబాబును తెలంగాణ అధికారపక్షం తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. అదే జరిగితే రెండు రాష్ట్రాల మధ్య అనవసరమైన ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇదొక సమస్య అయితే.. వారానికి రెండు రోజులు హైదరాబాద్లో బాబు కూర్చుంటే.. ఏపీలో పాలన కుంటుపడటం ఖాయం.

ఇప్పటికిప్పుడు ఏపీలో చంద్రబాబు చేయాల్సిన పనులు బోలెడన్ని ఉన్నాయి. తమను చంద్రబాబు పెద్దగా పట్టించుకోవటం లేదన్న భావన ఏపీ ప్రజల్లో వ్యక్తమయ్యే అవకాశం ఎక్కువ. అదే జరిగితే రెండింటికి చెడ్డ రేవడిగా చంద్రబాబు కావటం ఖాయం.

ఇంకో విషయం ఏమిటంటే.. చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చొన్నంత మాత్రాన తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అయిపోయి.. తెలంగాణ అధికారపక్షానికి ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం అవుతుందన్నది అత్యాశే అవుతుంది. ఏపీలో ప్రభుత్వానికి.. చంద్రబాబు నాయకత్వానికి ఇమేజ్ పెరుగుతున్న సమయంలో హైదరాబాద్ లో వారానికి రెండు రోజులు గడిపే కన్నా.. ఆ సమయాన్ని ఏపీ రాజధాని అమరావతి మీద నిలిపితే.. కలిగే లాభమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి అచ్చెన్నాయుడి సూచన ఏ మాత్రం సరికాదన్న మాట వినిపిస్తోంది.