Begin typing your search above and press return to search.

చంద్ర‌న్న కానుక గుట్టు విప్పిన అచ్చెన్న!!

By:  Tupaki Desk   |   8 Aug 2017 5:42 AM GMT
చంద్ర‌న్న కానుక గుట్టు విప్పిన అచ్చెన్న!!
X
ఎవ‌రికైనా మీరు కానుక ఇవ్వాల‌నుకుంటున్నారు. ఎలా ఇస్తారు? మీతో వారికుండే అనుబంధానికి త‌గ్గ‌ట్లుగా వారికి మీరిచ్చే కానుక ఉంటుంది. కానుక అంటే కొత్త‌దే అవుతుందే త‌ప్పించి.. వాడ‌కుండా మిగిలి పోయిన‌వి.. అమ్ముడు కానివి ఇస్తామా? ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అలా ఇవ్వ‌రు. కానీ.. ఏపీ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌న్న కానుక పేరిట ఇచ్చే కానుక‌ల గుట్టును ఏపీ మంత్రివ‌ర్యులు మాట‌ల ఫ్లోలో చెప్పేశారు.

నాన్ స్టాప్ గా మాట్లాడేసే ఏపీ మంత్రుల్లో అచ్చెన్నాయుడు ఒక‌రు. పెద్ద గొంతు వేసుకొని.. మ‌న‌సుకు తోచిన‌ట్లుగా మాట్లాడే ఆయ‌న తాజాగా అలాంటి మాట‌ల్లోనే చంద్ర‌న్న కానుక పేరిట ఏపీ స‌ర్కారు ఇచ్చేవి ఎలాంటివ‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు.

ప్ర‌తి సంక్రాంతికి పేద‌ల‌కు రేష‌న్ కార్డుల మీద ఇచ్చే చేనేత చీర‌.. ధోవ‌తిలు అమ్ముడు కానివి.. మిగిలిపోయిన‌వ‌న్న విష‌యాన్ని ఆయ‌న అధికారికంగా చెప్పేశారు. జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్ర‌న్న కానుక కింద ఇచ్చే చీర‌.. ధోవ‌తులు వివిధ సంఘాల్లో అమ్మ‌గా మిగిలిన వాటిని సేక‌రించి ప్ర‌భుత్వం ఇవ్వ‌నుంద‌ని పేర్కొన్నారు.

కానుకకు కొత్త భాష్యం ఇచ్చేలా అచ్చెన్న మాట‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఎంత పేద ప్ర‌జ‌లు అయితే మాత్రం.. సంఘాల్లో మిగిలిపోయిన బ‌ట్ట‌ల్ని కానుక‌గా ఇస్తారా? అన్న‌ది ప్ర‌శ్న‌. మ‌రి.. అలాంట‌ప్పుడు సంఘాల్లో అమ్ముడు కాని వాటినేం చేస్తామ‌ని ప్ర‌శ్న రావొచ్చు. ఒక‌వేళ‌.. చేనేత సంఘాల్ని ఆదుకోవాల‌న్న‌దే ఉద్దేశం అయిన‌ప్పుడు దానికి కానుక పేరు పెట్టే క‌న్నా.. మ‌రింకేదైనా కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసి ఇవ్వాలే కానీ.. పండుగ‌పూట మా గొప్ప‌గా చంద్ర‌న్న కానుక పేరు పెట్టి మ‌రీ అమ్ముడు కాని వ‌స్త్రాల్ని ఇవ్వ‌టం ఎంత‌మాత్రం స‌రికాదు. పేద ప్ర‌జ‌ల బ‌తుకుల్ని మార్చాల‌న్న ఆలోచ‌న ఉండాలే కానీ.. ఏం ఇచ్చినా తీసుకుంటార‌న్న భావ‌న వారిని అవ‌మానించ‌ట‌మే అవుతుంది.