Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రుల వాచాలత్వం

By:  Tupaki Desk   |   10 Aug 2015 11:21 AM GMT
ఏపీ మంత్రుల వాచాలత్వం
X
ఆంధ్రప్రదేశ్ మంత్రులు మరీ దారుణంగా వాచాలత్వం ప్రదర్శిస్తున్నారు. మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు పెద్దపీట వేసే అచ్చెన్నాయుడు అయితే తన నోటికి ఎదురే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాము మంత్రి వర్గంలో ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయి మరీ ఆరోపణలు గుప్పిస్తున్నారు.

గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు అచ్చెన్నాయుడు విలేకరుల ముందుకు వచ్చారు. చంద్రబాబును కాపాడడానికి ఆయన కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. పుష్కరాల సమయంలో ఎవరో వచ్చి షార్ట్ సర్క్యూట్ జరిగిందని అరిచారని, దాంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారని, తొక్కిసలాటలో 27 మంది చనిపోవడానికి ఇదే కారణమని చెప్పారు. దీని వెనక కుట్ర ఉందని చెప్పారు. ఆ తర్వాత దాని గురించి మర్చిపోయారు. ఒకవేళ నిజంగానే కుట్ర ఉంటే.. 27 మందిని చంపేస్తే.. ప్రభుత్వాన్ని, చంద్రబాబును అప్రతిష్టపాలు చేస్తే.. పుష్కరాల ప్రాంతంలో వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిలో ఎక్కడో ఒకచోట అది రికార్డు అయి ఉంటుంది. దానిని బయటకు తీయవచ్చు. లేదా విచారణ జరపవచ్చు. మృతుల కుటుంబ సభ్యులు కూడా వారితోనే ఉన్నారు కనక వారిని అడిగితే ఈ విషయం బయటపడిపోతుంది. కానీ ఏపీ సర్కారు అదేమీ చేయలేదు.

తాజాగా ప్రత్యేక హోదాను కోరుతూ మునికోటి ఆత్మాహుతి చేసుకుంటే అతని బలిదానాన్ని ఎగతాళి చేసేలా మాట్లాడారు. ఆత్మాహుతి చేసుకోవడానికి రెండు గంటల ముందు ఆయన హైదరాబాద్ లో ఉన్న చిరంజీవి, రఘువీరారెడ్డితో మాట్లాడారని, వారితో మాట్లాడి వెళ్లిన తర్వాతే ఆత్మాహుతికి పాల్పడ్డారని, వారిపై కేసు నమోదు చేయాలని ఆరోపించారు. ఒకవేళ ఇదే నిజమనుకుంటే.. మునికోటి కాల్ రికార్డులు ఉంటాయి. హైదరాబాద్ వచ్చి కలిసి వెళితే విమాన టికెట్లు ఉంటాయి. విచారణ జరిపితే ఎక్కడో ఒకచోట దొరికిపోతారు. ప్రభుత్వంలోనే ఉన్న అచ్చెన్నాయుడు కానీ, వర్ల రామయ్యకానీ విచారణకు ఎందుకు డిమాండ్ చేయడం లేదని, ఆ దిశగా చంద్రబాబుపై ఒత్తిడి ఎందుకు తేవడం లేదని ప్రశ్నిస్తున్నారు. కేవలం తాము ఆత్మ రక్షణలో పడినప్పుడు ఎదైనా వివాదాస్పద అంశం వచ్చినప్పుడు ఎదురు దాడిని పనిగా పెట్టుకున్నారని, అంశం ఏదైనా ఎదురు దాడి మార్గంగా ముందుకు సాగుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.