Begin typing your search above and press return to search.

అఫ్గాన్ విమానం నుంచి జారి పడింది అతగాడా?

By:  Tupaki Desk   |   20 Aug 2021 4:07 AM GMT
అఫ్గాన్ విమానం నుంచి జారి పడింది అతగాడా?
X
అఫ్గాన్ లో చోటు చేసుకున్న పరిణామాలు.. అధికారాన్ని హస్తగతం చేసుకొని పాలనను షురూ చేయాలని భావిస్తున్న తాలిబన్లు తాపత్రయపడుతుంటే.. వారి పాలనలో మళ్లీ తమకు పాత నరకం మొదలవుతుందని అఫ్గాన్లు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో.. పెద్ద ఎత్తున దేశాన్ని వీడి వెళ్లిపోయేందుకు సిద్ధపడటం తెలిసిందే. ఇందులో భాగంగా ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పలువురు.. దేశాన్ని విడిచిపెట్టేందుకు విమానాల్లోకి ఎక్కేయటం.. కదులుతున్న విమానంలోచోటు దక్కించుకోవటం కోసం ప్రయత్నించి విఫలమై.. కిందకు జారి పడి మరణించటం తెలిసిందే.

రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న విషాద ఉదంతాలు ప్రపంచాన్ని షాక్ కు గురి చేశాయి. తాజాగా ఈ విషాదానికి సంబంధించిన షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అఫ్గాన్ నుంచి వేరే చోటుకు వెళ్లాలన్న తపనతో విమానం ఎక్కి.. టేకాఫ్ వేళ ఫ్లైట్ నుంచి జారి పడి మరణించిన వారిలో ఒక యువకుడు ఉన్నాడు. అతడు మిగిలిన వారి మాదిరి సాధారణమైన కుర్రాడు కాడు.. యువ ఫుట్ బాల్ క్రీడాకారుడు జాకీ అన్వారీ అన్న విషయం వెలుగు చూసి షాకింగ్ గా మారింది.

ఈ ఉదంతం క్రీడాలోకానికి షాకింగ్ గా మారింది. అఫ్గాన్ జాతీయ ఫుట్ బాల్ జట్టులోని ఒక క్రీడాకారుడైన అన్వారీ.. ఇలాంటి దురవస్థలో మరణించటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాలిబన్ల పడగ నీడ తమ పిల్లల మీద పడకూడదని భావిస్తున్న అఫ్గాన్ తల్లిదండ్రులు ఎంతలా తాపత్రయపడుతున్నారో తెలిపే వీడియోలు కంట వెంట కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. కాబూల్ ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత వేలాది మంది కాబూల్ ను విడిచిపెట్టేందుకు సిద్ధమై.. విమానాశ్రయానికి వచ్చారు.

అయితే.. లోపలకువెళ్లేందుకు వీల్లేని రీతిలో ఇనుప కంచెల్ని ఏర్పాటు చేశారు. తమ చంటిబిడ్డల్ని రక్షించుకోవటం కోసం.. తమ బిడ్డల్ని దేశం నుంచి బయటకు తీసుకెళ్లిపోవాలని.. విమానాశ్రయంలో కాపాలాగా ఉన్న అమెరికా.. బ్రిటన్ దేశాల సైనికుల్ని వేడుకుంటున్నారు. కొందరైతే తమ పిల్లల్ని ఇనుప కంచె పై నుంచి లోపలకు విసిరేందుకు సైతం ప్రయత్నించారు. ఈ పరిణామాలుతనను ఎంతగానో బాధిస్తున్నాయని బ్రిటన్ సైనికుడు ఒకరు వెల్లడించారు. పిల్లలు తమ వద్ద లేకున్నా ఫర్లేదు.. సక్రమంగా బతికి ఉంటే చాలన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. తమ పిల్లలు తాలిబన్ల చేతికి చిక్కితే.. వారి జీవితం నరకప్రాయం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.