Begin typing your search above and press return to search.

ఆత్మకూరు సాక్షిగా అంతులేని వ్యూహం...?

By:  Tupaki Desk   |   25 April 2022 2:30 AM GMT
ఆత్మకూరు  సాక్షిగా  అంతులేని వ్యూహం...?
X
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి మరో చాన్స్ రాబోతోంది. ఈసారి కూడా సత్తా చాటడానికి ఆ పార్టీ చూస్తోంది. ఇప్పటికి రెండు ఉప ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అన్నింటా వైసీపీ విజయ దుందుభి మోగించింది. అయితే ఇపుడు మరో ఉప ఎన్నిక ముంగిట ఉంది. అదే ఆత్మకూరు ఉప ఎన్నిక. ఈ ఏడాది ఫిబ్రవరిలో మంత్రి హోదాలోనే గౌతం రెడ్డి ఆకస్మికంగా మరణించారు. దాంతో ఆరు నెలల వ్యవధిలో అక్కడ ఉప ఎన్నిక జరగాలి.

అలా కనుక చూసుకుంటే జూన్ 21లోగా ఉప ఎన్నిక పూర్తి కావాలి. దాంతో ఈ నెలాఖరులో నోటిఫికేషన్ ఇచ్చి మే నెలాఖరులోగా ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుందని భావిస్తున్నారు. ఏ విధంగా చూసుకున్నా గట్టిగా నెల రోజులు మాత్రమే ఉప ఎన్నిక పోరు ఉందన్న మాట. నిజానికి ఆత్మకూరు ఉప ఎన్నిక ఉండదు అనుకున్నారు.

ఏకగ్రీవమే అని కూడా భావించారు. కానీ తాజాగా బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని చెప్పారు. దాంతో ఎన్నిక అనివార్యం అని తేలుతోంది. మరి నోటిఫికేషన్ వచ్చాక టీడీపీ జనసేన ఎలాంటి పొలిటికల్ స్టాండ్ తీసుకుంటాయో తెలియదు. ఏది ఎలాగున్నా బద్వేల్ ఉప ఎన్నిక మాదిరిగానే ఆత్మకూరు లోనూ బీజేపీ వైసీపీతో తలపడుతుంది అని అంటున్నారు.

ఇక బీజేపీ ఒక్కటే పోటీలో ఉంటే పోరు వేరేగానే ఉంటుంది. ఈసారి టీడీపీ జనసేన ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తాయా లేదా అన్నది కూడా చూడాలి. ఇక నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. అదే విధంగా ఆత్మకూరు నుంచి మేకపాటి గౌతం రెడ్డి రెండు సార్లు గెలిచి ఉన్నారు. పైగా సడెన్ గా చనిపోయారు. ఆ సానుభూతి కూడా ఉంటుంది. దాంతో ఆయన సోదరుడు విక్రం రెడ్డి పోటీ చేస్తున్నారు.

దాంతో ఎవరు అవతల పోటీలో ఉన్నా తేలికగా ఈ ఉప ఎన్నికను తీసుకోకూడదు అని జగన్ భావిస్తున్నారుట. గెలుపు ఎటూ ఖాయమే. కానీ భారీ మెజారిటీ తీసుకురావాలన్నదే ఆయన ఆలోచన. ఆ దిశగా ఇప్పటి నుంచే నాయకులను సమాయత్తం చేస్తున్నారు అంటున్నారు. కనీ వినీ ఎరగని మెజారిటీని సొంతం చేసుకోవడం ద్వారా రెండేళ్ల వ్యవధిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న వేళ విపక్షాలకు బలమైన సంకేతం పంపాలని జగన్ ఆలోచిస్తున్నారు అంటున్నారు.

మొత్తానికి ఉప ఎన్నిక జరగాలనే వైసీపీ కూడా కోరుకుంటోంది అని అంటున్నారు. ఇక ఆత్మకూరు ఉప ఎన్నికతో బీజేపీ పోటీ చేస్తే జనసేన, టీడీపీ రాజకీయ వైఖరి ఎలా ఉంటుంది అన్నది కూడా తెలుస్తుంది అని అంటున్నారు. ఈ మూడు పార్టీల మధ్య ఫ్యూచర్ లో పొత్తులు ఉంటాయనుకుంటే ఇండైరెక్ట్ గా మద్దతు ఇవ్వవచ్చు అని తెలుస్తోంది. ఒక విధంగా టైట్ ఫైట్ కి విపక్షాలు చూస్తాయనే అంటున్నారు. మొత్తానికి ఆత్మకూరు సాక్షిగా అంతులేని వ్యూహాలకు తెర లేవనుంది అన్న మాట.