Begin typing your search above and press return to search.

ఆత్మ‌కూరులో ముగిసిన ప్ర‌చారం.. 23న పోలింగ్!

By:  Tupaki Desk   |   22 Jun 2022 3:19 AM GMT
ఆత్మ‌కూరులో ముగిసిన ప్ర‌చారం.. 23న పోలింగ్!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ఉప ఎన్నిక ప్రచారానికి జూన్ 21తో తెర‌ప‌డింది. మొత్తం 14 మంది అభ్య‌ర్థులు పోటీలో ఉన్నా ప్ర‌ధాన పోటీ మాత్రం వైఎస్సార్సీపీ, బీజేపీల మ‌ధ్య నెల‌కొని ఉంది. వైఎస్సార్సీపీ త‌ర‌ఫున మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి, బీజేపీ త‌ర‌పున భ‌ర‌త్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు.

వైఎస్ జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రిగా మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి క‌న్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయ‌న మృతితో ఆత్మ‌కూరు ఉప ఎన్నిక జ‌రుగుతుంది. ఇందులో భాగంగా జూన్ 23న పోలింగ్ జ‌రుగుతుంది. వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి.. దివంగ‌త మంత్రి గౌత‌మ్ రెడ్డి సోద‌రుడే కావ‌డం గ‌మ‌నార్హం.

బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాద‌వ్ పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరితోపాటు నియోజకవర్గంలోని మిగతా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. లక్ష ఓట్ల మెజారిటీ సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా గ్రామానికో ఎమ్మెల్యే, మండ‌లానికో మంత్రి అక్క‌డ తిష్ట‌వేశారు. ఓట‌ర్ల‌కు భారీ ఎత్తున ఇప్ప‌టికే డ‌బ్బులు కూడా పంపిణీ చేశార‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు ప్రచారం నిర్వహించారు.

జూన్ 23న పోలింగ్, 26న ఓట్ల లెక్కింపు జరగనుంది. 278 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. 122 కేంద్రాలను సమస్యాత్మకంగా ఎన్నికల అధికారులు గుర్తించారు. ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఓటర్లు 2,13,338 మంది. కాగా, ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లను ఎలక్షన్ కమిషనర్, కలెక్టర్, ఎస్పీ పరిశీలిస్తున్నారు.