Begin typing your search above and press return to search.

కుటుంబాల వైరం..పార్టీల వైరంగా మార్చిన చంద్రబాబు!?

By:  Tupaki Desk   |   13 Sep 2019 11:42 AM GMT
కుటుంబాల వైరం..పార్టీల వైరంగా మార్చిన చంద్రబాబు!?
X
ఒక తప్పును వందసార్లు చెప్పి ఒప్పుగా చిత్రీకరించేవారు సమాజంలో చాలా మంది ఉంటారు.. పూర్వం గోబెల్స్ కూడా అలాంటోడే.. అందుకే అలాంటి గోబెల్స్ ప్రచారంలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ముందుంటారని.. అధికారం కోసం ఎంతకైనా చంద్రబాబు దిగజారుతారని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. తిమ్మిన బమ్మిని చేసి.. గోబెల్స్ ప్రచారం చేసి మంచోళ్లపై చెడు ముద్ర వేస్తారని విమర్శిస్తుంటారు. తాజాగా ‘చలో ఆత్మకూరు’ పేరిట చంద్రబాబు ఆడింది అలాంటి డ్రామానే అని స్వయంగా ఆ ఊరి గ్రామస్థులే చెబుతున్నారు..

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందేందుకు ఆత్మకూరులోని రెండు కుటుంబాల వైరాన్ని పార్టీల వైరంగా మార్చేశారని ఆ ఊరి గ్రామస్థులు ఆడిపోసుకుంటున్నారు.. ఆత్మకూరులో రెండు కుటుంబాల గొడవలను రెండు పార్టీల గొడవగా చంద్రబాబు మార్చాడని మండిపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఆత్మకూరులోని ఓ కాలనీలో రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలున్నాయి. ఐదు సంవత్సరాల కింద గొడవలు వచ్చినప్పుడు ఒక కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు - వారి బంధువులు.. ప్రత్యర్థి కుటుంబ సభ్యుల మీద దాడికి దిగారు. పెద్ద ఎత్తున తలలు పగులకొట్టి బీభత్సం సృష్టించారు. దీంతో బెంబేలెత్తిపోయిన దాడికి గురైన బాధిత కుటుంబ సభ్యులు ఊరి బయటకు వెళ్లి ఇంకో కాలనీ ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు.

అయితే 2019 ఎన్నికల తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. ఊరు విడిచి వెళ్లిపోయిన బాధిత కుటుంబం మళ్లీ పాత కాలనీలోకి వచ్చి నివాసం ఉండటానికి ప్రయత్నం చేశారు. దీంతో వీరిపై దాడి చేసిన కుటుంబ సభ్యులకు ప్రత్యర్థి కుటుంబం మళ్లీ రావడంతో అనుమానించారు. బాధిత కుటుంబానికి అధికార వైసీపీ సపోర్టు ఉందని అందుకే కాలనీలోకి తిరిగివచ్చారని భయపడ్డారు. ఈ విషయాన్ని ఒక తెలుగు దేశం పార్టీ పెద్దకి విషయం చెప్పారు. దీంతో సదురు తెలుగుదేశం పెద్ద ఒక ప్లాన్ ప్రకారం.. పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి టీడీపీ సపోర్టర్స్ గా ఉన్న దాడిచేసిన కుటుంబాన్ని తీసుకెళ్లి ఆశ్రయం కల్పించాడని తెలిసింది. ఈ ఆత్మకూరు బాధితుల ఆశ్రయంలో ఇక్కడ ఎక్కడా కూడా పార్టీ గొడవలు లేవని గ్రామస్థులు చెబుతున్నారు.. కేవలం కుటుంబ గొడవలను టీడీపీ వాళ్లు అతి చేసి పెద్దది చేసి చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు కోసం పెద్దదిగా చూపించారని చెబుతున్నారు. దీన్ని పెద్ద ఎత్తున చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నం తప్పా ఎక్కడ కూడా పార్టీ గొడవలు లేవని ఆ గ్రామస్థులే వాపోతున్నారు..

చంద్రబాబు నాయుడు వల్ల ఇప్పుడు ఆత్మకూరు పేరు దేశవ్యాప్తంగా అభాసుపాలైందని ఆ గ్రామ పెద్దలు వాపోతున్నారు. చంద్రబాబు పెద్ద ఎత్తున ఊరుపేరుతో వివాదం చిత్రీకరించేసరికి మా ఊరిలోని అమ్మాయిలు, అబ్బాయిలకు పెళ్లిళ్లు అయ్యే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. చంద్రబాబు కనుక ఆత్మకూరుకు వస్తే దీనిపై నిలదీసేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారట.. ఇదీ ‘ఛలో ఆత్మకూరు’ వెనుక అసలు కథ అని గ్రామస్థులు వివరిస్తున్నారు. టీడీపీ ఆడిందంతా డ్రామా అంటున్నారు. ఆ డ్రామాలో ఆత్మకూరు ఊరు బలైందని వాపోతున్నారు.