Begin typing your search above and press return to search.

అతడ్ని సీఎం జగన్ కలిశారంటే.. ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి తేలిపోయినట్లే

By:  Tupaki Desk   |   29 April 2022 5:15 AM GMT
అతడ్ని సీఎం జగన్ కలిశారంటే.. ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి తేలిపోయినట్లే
X
అనూహ్యంగా అనారోగ్యానికి గురై నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు వదిలిన ఏపీ ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణాన్ని ఇప్పటికి జీర్ణించుకోలేని వారెందరో. అలాంటి నేత చిన్న వయసులోనే కాలం చేయటం ఒక ఎత్తు అయితే.. ఆయన కారణంగా ఖాళీ అయిన ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎవరు నిలుచుంటారు? అన్న దానిపై చర్చ జరుగుతోంది.

పలువురి అంచనా ప్రకారం మేకపాటి గౌతంరెడ్డి సతీమణికి అవకాశం ఇస్తారని భావించారు. అందుకు భిన్నంగా తాజాగా చోటు చేసుకున్న పరిణామం చూస్తే లెక్కలు మారిపోయినట్లుగా కనిపిస్తుంది. మేకపాటి గౌతంరెడ్డి రాజకీయ వారసుడిగా గౌతమ్ సోదరుడు విక్రమ్ రెడ్డిని తెర మీదకు తీసుకొచ్చారు. గౌతమ్ రెడ్డి తండ్రి కమ్ వైసీపీ సీనియర్ నేత.. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తన కుమారుడ్ని స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకురావటంతో ఉప ఎన్నిక విషయంపై క్లారిటీ వచ్చేసిందని చెప్పాలి.

త్వరలోనే ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించేందుకు వీలుగా విక్రమ్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. దానికి ముందు.. పార్టీ అధినేత ఆశీస్సులతో తన పర్యటనను ప్రారంభించాలని భావించారు. దీనికి విక్రమ్ తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆమోదం ఉండటంతో.. మిగిలినవన్నీ తేలికయ్యాయి.

ఇంతకాలం వ్యాపారం చేస్తున్న విక్రమ్ తన సోదరుడి ఆకస్మిక మరణంతో ప్రజాసేవలోకి రావాలని నిర్ణయించినట్లుగా మేకపాటి కుటుంబం డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని రెండు వారాల క్రితం సీఎం జగన్ కు చెప్పటం.. ఆయన్ను కలిసేందుకు అనుమతి కోరగా.. అందుకు ఆయన ఓకే చెప్పటంతో తాజాగా వారి మధ్య భేటీ జరిగింది.

అధికారికంగా ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి ఎవరన్న దానిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ.. గౌతమ్ సోదరుడు విక్రమ్ తదుపరి రాజకీయ వారసుడన్న విషయాన్ని సీఎం జగన్ భేటీతో స్పష్టం చేసిన పరిస్థితి.

దీంతో.. ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన వెంటనే అధికారిక ప్రకటన ఉంటుందని.. ఆ లోపు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పర్యటించాలన్న వ్యూహాన్ని విక్రమ్ అమలు చేయనున్నారు. కాకుంటే గౌతమ్ సతీమణి కాకుండా ఆయన సోదరుడు బరిలోకి రావటం ఆసక్తికర చర్చకు తెర తీసినట్లుగా చెబుతున్నారు.