Begin typing your search above and press return to search.

తాడిపత్రిలో దారుణం.. జర్నలిస్టులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కుమారుడి దాడి

By:  Tupaki Desk   |   11 Jun 2022 9:30 AM GMT
తాడిపత్రిలో దారుణం.. జర్నలిస్టులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కుమారుడి దాడి
X
అనంతపురం జిల్లా తాడిపత్రిలో అధికార వైఎస్సార్సీపీ నేతలు రెచ్చిపోయారు. అధికారం అండతో జర్నలిస్టులపై దాడికి తెగబడ్డారు. మీడియా ప్రతినిధులను చితకబాదారు. స్వయంగా తాడిపత్రి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి జర్నలిస్టులను చితక బాదారు. ఈ ఘటనలో జర్నలిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతల దాడులపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటన వివరాల్లోకెళ్తే..

తాడిపత్రి పట్టణం నుంచి వెళ్లే భూగర్భ డ్రైనేజీ పైపులైన్‌ ఒకటి మరమ్మతులకు గురైంది. దీనికి దాదాపు రూ.2లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. మున్సిపాలిటీ ఈ ఖర్చును భరించడం కష్టమని నిర్ణయానికి వచ్చిన తెలుగుదేం పార్టీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తన సొంత ఖర్చుతో ఆ పైపులైన్‌ మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో ఈ పనిని మల్లికార్జున్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అయితే ఈ పనిని జేసీ ప్రభాకర్‌రెడ్డి చేయించడం ఏంటని తాడిపత్రి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు కేతిరెడ్డి హర్షవర్దన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాగా ఎమ్మెల్యే కుమారుడు హర్షవర్దన్‌రెడ్డి తాడిపత్రి 31వ వార్డు కౌన్సిలర్‌గా ఉన్నారు. ఈ క్రమంలో హర్షవర్దన్‌రెడ్డి తన అనుచరులతో పైపులైను మరమ్మతులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఈ పనులు మీరు చేయడం ఏంటి మేము చేస్తాం అంటూ జేసీ ప్రభాకరరెడ్డి వర్గంతో ఘర్షణకు దిగారు. భూగర్భ డ్రైనేజీ పనులు మేమే చేస్తామంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు తేల్చిచెప్పారు.

దీంతో అటు జేసీ ప్రభాకరరెడ్డి వర్గం, ఇటు ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతలో విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న విలేకరులు ఈ ఘటనను వీడియో తీయడం ప్రారంభించారు. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు, కౌన్సిలర్ హర్షవర్దన్‌రెడ్డి విలేకరులపై దాడికి దిగారు. ఆ తర్వాత ఆయన అండతో వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకులు అంతా వచ్చి కాంట్రాక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి, విలేకరులు, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్‌పై మూకుమ్మడిగా దాడి చేసి చితకబాదారు.

ఈ ఘటనలో టీడీపీ కౌన్సిలర్‌ పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. ఒక విలేకరికి చెవి పూర్తిగా దెబ్బతిందని.. ఆయన వినికిడి శక్తి కోల్పోయినట్లు తాడిపత్రి వైద్యులు ధ్రువీకరించారు. మెరుగైన వైద్యం కోసం ఈ వారిని అనంతపురం ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఇంతలో పోలీసులు చేరుకుని ఇరు వర్గాలను శాంతింపచేయడంతో ఉద్రికత్త సద్దుమణిగింది.