Begin typing your search above and press return to search.

బండి సంజయ్ కారు మీద దాడి జరిగిందా? అసలేం జరిగింది?

By:  Tupaki Desk   |   1 Dec 2020 2:45 AM GMT
బండి సంజయ్ కారు మీద దాడి జరిగిందా? అసలేం జరిగింది?
X
హాట్ హాట్ గా సాగిన ఎన్నికల ప్రచారం ముగిసి రోజు దాటింది. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు కొన్ని గంటల ముందు.. సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన వాతావరణాన్ని హాట్ హాట్ గా మార్చటమే కాదు.. ఉద్రిక్త పరిస్థితులకు తెర తీశాయి. మొత్తంగా ఈ ఉదంతాన్ని చూస్తే.. చిన్నపాటి కమ్యునికేషన్ గ్యాప్ ఇంత పెద్ద రచ్చకు కారణంగా చెప్పాలి. అసలేం జరిగిందన్న విషయాన్ని అక్కడి ప్రత్యక్ష సాక్ష్యలు తెలియజేసిన దాని ప్రకారం చూస్తే.. ఎన్నికల ప్రచారంతో బిజీబిజీగా గడిపిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ రోజు సాయంత్రం సరదాగా గడిపేందుకు పీపుల్స్ ప్లాజాకు వచ్చారు.

అదే సమయంలో అక్కడకు మీడియా వారు చేరుకున్నారు. సరదగా ఛాయ్ తాగేందుకు లేక్ వ్యూ పోలీస్ స్టేషన్ అవుట్ పోస్టు సమీపంలో ఉన్న హోటల్ వద్దకు వెళ్లారు. ఇదిలా ఉన్న వేళ.. తాను బరిలో ఉన్న ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని ఓటర్లను మభ్య పెట్టేందుకు సంజయ్ ప్రయత్నిస్తున్నట్లుగా టీఆర్ఎస్ అభ్యర్థి విజయా రెడ్డి (స్వర్గీయ పీజేఆర్ కుమార్తె) అక్కడకు చేరుకున్నారు.

అప్పటికే ఆమెకు ఓట్లను మభ్య పెట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుందన్న తప్పుడు సమాచారం అందటంతో ఆమె తన కార్యకర్తలతో కలిసి వచ్చారు. తన డివిజన్ లో ఓటర్లను ఎందుకు మభ్య పెడుతున్నట్లుగా ప్రశ్నించారు. డబ్బు పంపిణీ చేస్తున్నట్లుగా ఆరోపించారు. అయితే..తాను అలాంటి పని చేయటం లేదని చెప్పే క్రమంలోనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికే విజయా రెడ్డి కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవటంతో.. అనవసరమైన ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా.. బండి సంజయ్ ను పోలీసులు మరో వాహనంలో పంపేశారు.

ఘటనా స్థలంలో బీజేపీ కేటాయించిన వాహనాన్ని అక్కడే వదిలేశారు బండి సంజయ్. కారులో నగదు ఉందని.. దాన్ని తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో.. విజయారెడ్డి అనుచరులు పలువురు.. అక్కడే నిలిపి ఉంచిన బండి సంజయ్ వాహనం మీద పెద్ద ఎత్తు.. చేతులతో చరచటం.. ఆ క్రమంలో అద్దాలు పగిలిపోయాయి. ఉండేకొద్దీ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా తయారవుతుందన్న ఆలోచనతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అప్పటికే రెండు పార్టీలకు చెందిన వారు అక్కడకు చేరుకొని పోటాపోటీగా నినాదాల షురూ చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు బండి సంజయ్ కు పార్టీ కేటాయించిన వాహనాన్ని అక్కడ నుంచి పంపే ప్రయత్నం చేశారు పోలీసులు.

అయితే..వాహనాన్ని తనిఖీ చేసి మాత్రమే పంపాలని పట్టుబట్టటం.. అక్కడే ఎక్కువ సేపు వాహనం (అందులో బండి సంజయ్ లేరన్నది మర్చిపోకూడదు) ఉంటే.. జరగరానిది ఏదైనా జరిగితే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో పోలీసులు బండి వాహనాన్ని అక్కడ తరలించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవటంతో.. బలవంతంగా.. ఇరు పక్షాల వారిని చెదరగొట్టి.. కారును అక్కడి నుంచి పంపించేశారు. దీనిపై విజయారెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి.. బండి సంజయ్ మీద కేసు నమోదు చేయాలని కోరితే.. తనపై దాడి చేసినట్లుగా బండి సంజయ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

పోలింగ్ కు కొన్ని గంటల ముందు చోటు చేసుకున్న ఈ వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇలాంటి ఉదంతాల కోసం కాచుకు కూర్చొనే కొన్ని అతిగాళ్లు.. బండి సంజయ్ మీద హత్యాయత్నం జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారు. కారులో లేని సంజయ్ పైన హత్యాయత్నం ఎలా చేస్తారన్న వాస్తవాన్ని మర్చిపోయి.. సంచలనం కోసం అనవసరమైన సమాచారాన్ని వైరల్ చేస్తున్నారు. ఇలాంటివేమీ నమ్మొద్దని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు. ఈ ఉదంతం చోటు చేసుకున్న కాసేపటికే డీసీపీ విశ్వ ప్రసాద్ చేరుకొని.. బండి సంజయ్ మీద ఎలాంటి హత్యాయత్నం జరగలేదని స్పష్టం చేశారు.