Begin typing your search above and press return to search.

కర్ణాటకలో తమిళుల పరిస్థితి ఎలా ఉందంటే...

By:  Tupaki Desk   |   12 Sep 2016 11:19 AM GMT
కర్ణాటకలో తమిళుల పరిస్థితి ఎలా ఉందంటే...
X

గడిచిన కొన్ని రోజులుగా కర్ణాటక – తమిళనాడుల మధ్య నడుస్తున్న కావేరీ జలాల సమస్య రోజు రోజుకీ తీవ్రమవుతుంది. ఇప్పటికే ఈ విషయంపై సుప్రీం కోర్టు ఉత్తర్వ్యులు జారీ చేసినప్పటికీ కర్ణాటకలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాస్తోరోకోలు.. ధర్నాలు.. బంద్ లతో ఉద్యమం తీవ్రమవుతున్న వేళ.. కొందరు విధ్వంసకారులు రెచ్చిపోయి తమిళనాడుకు చెందినవారి ఆస్తుల్ని - తమిళనాడు నెంబర్ ప్లేట్ తో ఉన్న వాహనాలను టార్గెట్ చేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చెయ్యరాదనే అంశంపై కన్నడ సంఘాలు చేపట్టిన ఆందోళల్లో భాగంగా చెన్నై నగరంలో కన్నడిగులపై దాడులు - వాహనాలు ధ్వంసం చేశారని వెలుగు చూడటంతో.. కర్ణాటకలో తమిళులపై ప్రతీకార దాడులకు మొదలైపోయాయి. ఈ మేరకు సోమవారం మండ్య జిల్లాలోని పాండవపురలో తమిళనాడు వ్యక్తులు నిర్వహిస్తున్న దుకాణాలను ధ్వంసం చేసిన కన్నడీగులు - వాటిలో కొన్నింటికి నిప్పు పెట్టడంతోపాటు తమిళనాడుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ కనిపిస్తే చాలు ఆ వాహనాల పై రాళ్ల వర్షం కురిపించడం - మరి కొన్నింటిని తగలబెట్టడం చేస్తున్నారు. ఇదే క్రమంలో బెంగళూరులోని మైసూరు రోడ్డుపై ఉన్న తమిళనాడుకు చెందిన లారీలు - ట్యాంకర్ కు నిప్పంటించారు. ఇదే రోడ్డులోని శాటిలైట్ బస్ స్టాండ్ లో ఉన్న తమిళనాడుకు చెందిన ఆనంద్ భవన్ హోటల్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆందోళనలు ఎక్కువకావడంతో పోలీసులు నాలుగు సార్లు లాఠీచార్జ్ చేయడంతోపాటు మాజీ శాసన సభ్యుడు వాటళ్ నాగరాజ్ తదితరులను అరెస్టు చేశారు. పరిస్థితి మరీ ఉదృతంగా మారడంతో పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపి.. ముందు జాగ్రత్త చర్యగా తమిళ ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరించారు.