Begin typing your search above and press return to search.

గార్డెన్ సిటీలో తెలుగోళ్ల‌పై దాడి!

By:  Tupaki Desk   |   21 March 2017 5:43 AM GMT
గార్డెన్ సిటీలో తెలుగోళ్ల‌పై దాడి!
X
గార్డెన్ సిటీగా సుప‌రిచిత‌మైన బెంగ‌ళూరు మ‌హాన‌గ‌రంలో తెలుగోళ్ల‌పై విద్వేష దాడి జ‌రిగింది. తెలుగు ఐటీ నిపుణుల్ని ల‌క్ష్యంగా చేసుకుంటూ ఒక ప్రాంతంలో జ‌రిగిన దాడి.. ఇప్పుడు తెలుగు ఐటీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బెంగ‌ళూరు మ‌హాన‌గ‌రంలో తెలుగు ఐటీ నిపుణులు ఎక్కువ‌గా నివ‌సించే మున్నేకొలాల‌లో జ‌రిగిన ఒక గొడ‌వ.. విద్వేష దాడికి దారి తీసిన‌ట్లుగా చెబుతున్నారు. మున్నేకొలాల‌లోని తెలుగువారు నివసిస్తున్న పేయింగ్ గెస్ట్ హాస్ట‌ళ్ల‌పై దాడి చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ఈ దాడికి మూలం శుక్ర‌వారం రాత్రి చోటు చేసుకున్న ఘ‌ట‌న‌గా చెబుతున్నారు. బైకుపై నిర్ల‌క్ష్యంగా వెళుతున్న స్థానిక యువ‌కులు రోడ్డుపై న‌డుస్తున్న తెలుగు ఐటీ నిపుణుడ్ని ఢీ కొట్టారు. దీంతో.. వాగ్వాదం చోటు చేసుకుంది. నాన్ లోక‌ల్ అయిన మీరు లోక‌ల్ అయిన మమ్మ‌ల్నే అంటారా? అంటూ బైకు మీదున్న స్థానికులు వాదులాట‌ను మ‌రింత పెంచారు. ఈ సంద‌ర్భంగా తెలుగువారిని తీవ్రంగా తిట్టిపోశారు.

చుట్టుప‌క్క‌ల వారు.. స్థానికుల తీరును త‌ప్పు ప‌ట్టారు. ఒక‌ద‌శ‌లో వారిపై చేయి చేసుకున్నారు. దీంతో.. ఆ ప్రాంతంలో ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. ఈ ఉదంతం ఎక్క‌డి వ‌ర‌కూ వెళుతుంద‌న్న భ‌యాన్ని కొంద‌రు వ్య‌క్తం చేశారు. అనుమానించిన‌ట్లే.. అదే రోజు రాత్రి దాదాపు న‌ల‌భైకి పైగా స్థానికులు క‌ర్ర‌లు ప‌ట్టుకొని.. వీధుల్లో తిరుగుతూ తెలుగువారిని తీవ్రంగా తిట్టిపోసిన‌ట్లుగా చెబుతున్నారు.

శ‌నివారం రాత్రి పెద్ద సంఖ్య‌లో కార్ల‌ల్లో వ‌చ్చిన యువ‌కులు.. కాల‌నీలోని అన్ని ఇళ్ల‌ల్లో లైట్లు బంద్ చేయించారు. అనంత‌రం ప్ర‌తి హాస్ట‌ల్ రూమ్ తిరిగి అనుమానం వ‌చ్చిన అంద‌రిపై దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన యాభైకు పైగా ఐటీ నిపుణులు గాయ‌ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ దాడుల‌పై బెంబేలెత్తిపోయిన తెలుగు ఐటీ నిపుణులు.. విష‌యాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లేందుకు సాహ‌సించ‌లేదు. స్థానికుల దాడుల‌కు భయ‌ప‌డి.. రాత్రంతా త‌లుపులు తీయ‌కుండా భ‌యంతో ఉండిపోయారు. సోమ‌వారం.. ఐటీ కంపెనీల్లో ఈ దాడుల‌కు సంబంధించిన విష‌యాలు తెలుగు వారి మ‌ధ్య పెద్ద చ‌ర్చ‌కు దారి తీశాయి. మామూలుగా అయితే.. బెంగ‌ళూరులో క‌న్న‌డిగుల‌కు.. తెలుగువారికి మ‌ధ్య చ‌క్క‌టి సంబంధాలే ఉన్నాయి. అయితే.. ఇటీవ‌ల కాలంలో కొన్ని అంశాల్లో స్థానికులు.. తెలుగు ఐటీ నిపుణుల మ‌ధ్య విభేదాలు మొద‌లైన‌ట్లుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన మ‌రింత స‌మాచారం రావాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/