Begin typing your search above and press return to search.

ఆ పుస్తకాన్ని అనువాదం చేసినోళ్లకి కత్తిపోట్లు.. హత్యాయత్నాలే

By:  Tupaki Desk   |   13 Aug 2022 4:20 AM GMT
ఆ పుస్తకాన్ని అనువాదం చేసినోళ్లకి కత్తిపోట్లు.. హత్యాయత్నాలే
X
వివాదాస్పద రచయితగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీపై తాజాగా హత్యాయత్నం చేయటం.. మెడపై కత్తి పోట్లకు గురి కావటంతో.. ఆయనపై దాడి జరిగిన ప్రదేశంలోనే కుప్పకూలిపోవటం తెలిసిందే. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన ఆయన ఉదంతంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

నిజానికి ఆయన రాసిన పుస్తకాల్లో 'ది సాతానిక్ వెర్సెస్' పుస్తకం అత్యంత వివాదాస్పదంగా కావటమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ పుస్తకాన్ని విపరీతంగా వ్యతిరేకించారు. పలుచోట్ల ఆయన తలకు ధర కూడా పెట్టేశారు మత ఛాందసులు. ఆయన్ను చంపేస్తామని బెదిరింపులు భారీ ఎత్తున సాగాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆయనరాసిన ది సాతానిక్ వెర్సెస్ పుస్తకాన్ని వేర్వేరు భాషల్లో అనువాదం చేసిన పలువురు రచయితల మీద హత్యాయత్నాలు జరగటం మాత్రం షాకింగ్ అంశంగా చెప్పక తప్పదు. ఈ పుస్తకాన్ని రాసిన వెంటనే అంటే.. 1989లో ఇరాన్ కు చెందిన షియా ఇస్లామిక్ నేత అయాతొల్లాహ్ ఖొమెయినీ ఫత్వా జారీ చేశారు. సల్మాన్ ను చంపేయాల్సిందిగా చెప్పారు.

ఈ పుస్తకాన్ని జపనీస్ లోకి అనువదించిన హితోషి ఇగరాషిని 1991 జులైలో కత్తితో పొడిచి చంపేశారు. ది సాతానిక్ వర్సెస్ ను ఇటాలియన్ లోకి అనువదించిన అనువాదకుడు ఎట్టోర్ కాప్రియో మీద కూడా కత్తులతో దాడి జరిగింది. కాకుంటే.. ఆ కత్తిపోట్లకు గాయపడ్డినప్పటికీ ప్రాణాలు మాత్రం దక్కించుకున్నాడు. ఈ పుస్తకాన్ని ఇటాలియన్ లో పబ్లిష్ చేసేందుకు ఓకే చేసిన పబ్లిషర్ విలియం నైగార్డ్ మీద 1993 అక్టోబరులో హత్యాయత్నం జరిగింది.

ఈ పుస్తకాన్ని టర్కిష్ తో అనువాదం చేసిన అజీజ్ నేసిన్ ను 1993 జులై 2న కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ దాడిలో గాయపడినప్పటికీ లక్కీగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇలా ఈ పుస్తకాన్ని అనువాదం చేసినోళ్ల మీదా.. దాన్ని పబ్లిష్ చేసేందుకు ముందుకు వచ్చిన వారిలో చాలామందికి ప్రాణాపాయ పరిస్థితులు నెలకొన్నదుస్థితి. ఈ పుస్తకాన్ని భారత్ తో పాటు.. చాలా ఇస్లామిక్ దేశాల్లో బ్యాన్ చేశారు.

అప్పట్లోఈ పుస్తకం రేపిన కలకలం అంతా ఇంతా కాదు. ఒక పుస్తకం వివాదాస్పదం కావటం మామూలే అయినా.. ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థాయిలో దాడులు జరిగి.. ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడని పరిస్థితులు ఈ పుస్తకం విషయంలోనే ఎక్కువగా జరిగాయన్న మాట వినిపిస్తూ ఉంటుంది.