Begin typing your search above and press return to search.

ట్రంప్ మద్దతుదారుల దాడులు.. అమెరికాలో తీవ్రమైన అల్లర్లు

By:  Tupaki Desk   |   8 Nov 2020 1:50 PM GMT
ట్రంప్ మద్దతుదారుల దాడులు.. అమెరికాలో తీవ్రమైన అల్లర్లు
X
డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ మ్యాజిక్ మార్కును దాటేసి అమెరికా అధ్యక్షుడు అయిపోతున్నారు. అయితే ట్రంప్ మాత్రం గెలిచింది తానే అంటూ ఖరాకండిగా చెబుతున్నాడు. ఎన్నికల్లో అక్రమాలపై తాజాగా మరికొన్ని ప్రకటనలు చేశారు.

దీంతో ట్రంప్ మద్దతుదారులు అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. రోడ్లపైకొచ్చి ఎన్నికల ఫలితాలను ఖండిస్తూ కనపడ్డవాళ్లందరిపై భయానక రీతిలో దాడులు చేస్తున్నారు.

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలను ఆయా రాష్ట్రాలే నిర్వహిస్తుంటాయి. ఇది అనాదిగా అక్కడ జరుగుతోంది. రాష్ట్రాలే సుప్రీం అమెరికాలో.. ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ పాత్ర నామమాత్రంగా ఉండటం, ఈసారి సగానికిపైగా ఓట్లు పోస్టల్ బ్యాలెట్ రూపంలో రావడం, వాటిని ఎప్పటి వరకు స్వీకరించాలి, ఎలా లెక్కబెట్టాలనే దానిపై రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు ఉండటంతో ఫలితాల వెల్లడిలో గందరగోళం ఏర్పడింది. ఎలక్షన్ డే(మంగళవారం) ముగిసి ఐదు రోజులవుతున్నా ఇంకా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిండం కుట్రే అని, కౌంటింగ్ కేంద్రాల్లోకి రిపబ్లికన్ పరిశీలకులను అనుమతించడం లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. తాజాగా తాను 71 మిలియన్ (7 కోట్ల) లీగల్ ఓట్లతో గెలుపొందానని ఆయన ప్రకటించుకున్నారు.

జోబైడెన్ విజయం ఖరారైన తర్వాత కూడా ట్రంప్ ఈ తరహా ప్రకటనలు చేయడంతో రిపబ్లికన్ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. అప్పటికే రోడ్లపైన చేరి సంబురాలు చేసుకుంటోన్న బైడెన్ మద్దతుదారులపై ట్రంప్ అనుకూల గ్యాంగులు దాడులకు పాల్పడ్డాయి. వాషింగ్టన్, న్యూయార్క్, మిచిగన్, ఓరెగాన్ తదితర రాష్ట్రాల్లో ట్రంప్ వర్గం దాడులకు పాల్పడుతోన్న ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.

ట్రంప్ వరుస ప్రకటనలతో ఆయన మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టిస్తున్నారు. బేస్ బాల్ బ్యాట్లు, పెప్పర్ స్ప్రేలు చల్లి కార్లను ధ్వంసం చేస్తున్నారు.పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.