Begin typing your search above and press return to search.

భారీ ఫైన్ల వెనుక అసలు రహస్యాన్ని చెప్పిన కేంద్రమంత్రి

By:  Tupaki Desk   |   5 Sep 2019 8:26 AM GMT
భారీ ఫైన్ల వెనుక అసలు రహస్యాన్ని చెప్పిన కేంద్రమంత్రి
X
నిన్నటి వరకూ వందల్లో ఉన్న జరిమానాలు ఇప్పుడు వేలల్లోకి వెళ్లిపోవటమే కాదు.. వాహనాన్ని ఇష్టారాజ్యంగా నడిపినా.. పార్క్ చేసినా.. చివరకు హెల్మెట్ పెట్టుకోకున్నా వేలల్లో జరిమానాలు చెల్లించే రోజులు వచ్చేశాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త వాహన చట్టాన్ని అమల్లోకి తీసుకురావటం తెలిసిందే.

దీంతో.. పలు రాష్ట్రాల్లో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించదు కానీ.. భారీగా ఫైన్లు మాత్రం వేస్తారే? అన్న రుసరుస సోషల్ మీడియాలో జోరందుకుంది. ఇదిలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త చట్టాన్ని ఇంకా అమల్లోకి తీసుకురాలేదు. ఇదిలా ఉంటే.. భారీ జరిమానాల వెనుక అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.

కొత్త వాహన చట్టంతో భారీగా మోగుతున్న చలానాలు విధించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం ఎంత మాత్రం కాదని..ఒక రోజుకు ఫైన్లు అంటూ లేని రోజు రావాలని.. అందులో భాగంగానే నిబంధనల్ని తూచా తప్పకుండా ఉండేందుకు వీలుగా భారీ జరిమానాల్ని తీసుకొచ్చినట్లుగా చెప్పారు. గడ్కరీ సాబ్ చెప్పినట్లుగా.. ఈ కొత్త వాహన చట్టానికి ముందు వరకూ ట్రాఫిక్ నిబంధనల గురించి పెద్దగా పట్టించుకునే వారుకాదు. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా మార్పు నెమ్మదిగా మొదలైంది. ఈ బారీ జరిమానాలు పెద్ద ఎత్తున వసూలు చేయటం ద్వారా.. పరిస్థితి అంతో ఇంతో మెరుగుపడటం ఖాయమంటున్నారు. అంతా బాగుంది కానీ.. గడ్కరీ కోరుకున్నట్లుగా చలానాలు లేని రోజు అంటూ వస్తుందంటారా?