Begin typing your search above and press return to search.

త‌న‌కేం రూల్స్ వ‌ర్తించ‌వంటున్న బాబు స‌ర్కారు

By:  Tupaki Desk   |   12 May 2017 10:05 AM GMT
త‌న‌కేం రూల్స్ వ‌ర్తించ‌వంటున్న బాబు స‌ర్కారు
X

తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు స‌హా ఆ పార్టీ నేత‌లు నోరెత్తితే నిబంధ‌న‌లు - విలువలు - ప్ర‌జాస్వామ్యం - ప‌ద్ద‌తులు...ఇలా ఎన్నో ఎన్నెన్నో మాట‌లు చెప్తుంటారు. కానీ చేత‌ల్లో...అలాంటి లైట్ అని నిరూపించుకుంటారు. ఇందుకు ఎన్నో ఉదాహర‌ణ‌లు ఉన్నాయి. తాజాగా ఇలా తెలుగుదేశం ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల‌ను తుంగ లోకి తొక్కిన విష‌యం ఏమిటంటే టీడీపీ మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌. సాక్షాత్తు టీడీపీ స‌ర్కారు రూపొందించిన నిబంధ‌న‌లను తెలుగుదేశం పార్టీ కార్య‌క్ర‌మం అయిన మహానాడు విష‌యంలో వ‌ర్తించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

టీడీపీ పార్టీ కార్య‌క్ర‌మం అయిన మ‌హానాడుకు విశాఖ‌లోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ వేదికగా ఖరారు చేశారు. ఇందులో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే... రాజకీయ పార్టీల కార్యకలాపాలు మతపరమైన కార్యక్రమాలకు విద్యా సంస్థలకు చెందిన ప్రాంగణాల్లో అనుమతించకూడదన్న నిబంధన ఉన్న‌ప్ప‌టికీ టీడీపీ మహానాడు కోసం ఏయూ గ్రౌండ్స్‌ను ఓకే చేసేసుకున్నారు. మ‌రో ముఖ్య‌మైన పాయింట్ ఏంటంటే...టీడీపీ అధికారం చేపట్టిన తరువాత విద్యా సంస్థ ప్రాంగణాల్లో రాజకీయ - మతపరమైన కార్యక్రమాలు చేపట్టరాదంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏయూ గ్రౌండ్స్‌ కు సంబంధించి ఇదే నిబంధనను అధికారులు ఇప్పటి వరకూ పాటిస్తూ వస్తున్నారు.

గతంలో విపక్ష వైసీపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను చాటుకునేందుకు జై ఆంధ్రప్రదేశ్ సభ - యువభేరి సమావేశాల నిర్వహణకు ఏయూ ప్రాంగణాన్ని కేటాయించాల్సిందిగా కోరింది. అయితే, రాజకీయ పార్టీ కార్యక్రమం కావడంతో ఇచ్చేందుకు కుదరదంటూ ఏయూ వర్గాలు నిరాకరించాయి. దీంతో వైసీపీ తన కార్యక్రమాలను వేరే వేదికకు మార్చుకుంది. కొద్ది రోజుల కిందట హిందూ ప్రచార సంస్థ ఒకటి ఏయూ గ్రౌండ్స్‌లో సమావేశాన్ని నిర్వహించాలని ఏయూ వర్గాలను కోరింది. తొలుత అంగీకరించిన ఎయు వర్గాలు, సంబంధిత సంస్థ నుంచి అద్దె కూడా వసూలు చేసిన యంత్రాంగం చివరి నిముషంలో వేదిక ఇచ్చేందుకు కుదరదంటూ తేల్చి చెప్పింది. అప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న సంబంధిత సంస్థ చివరకు గత్యంతరం లేక ప్రత్యామ్నాయం చూసుకుంది. కాగా తాజాగా టీడీపీ మహానాడు వేదిక ఎంపిక విషయంలో ``నాటకీయ`` పరిణామాలు చోటుచేసుకొని చివరకు ఏయూ గ్రౌండ్స్‌నే ఖరారు చేశారు.

గ్రౌండ్స్ ఖ‌రారు చేయ‌డ‌మే కాదు....మంత్రులు, పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు ఎయు గ్రౌండ్స్‌ను పలు విడతలుగా సందర్శించి, ఏర్పాట్లపై చర్చించారు. సాక్షాత్తు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా ఎయు గ్రౌండ్స్‌లో మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. టీడీపీ మహానాడు వేదిక వ్యవహారం ఇంత వివాదస్పదం అవుతున్నప్పటికీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు మాత్రం నోరు మెదపక‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. విశాఖలో తలపెట్టిన మహానాడు ద్వారా నిబంధ‌న‌లు, నీతి సూత్రాలు ఎదుటివారికే త‌ప్ప త‌మ‌కు కాద‌ని తెలుగుదేశం పార్టీ మ‌రోమారు తేల్చిచెప్పిన‌ట్లు అయింద‌ని ప‌లువురు మండిప‌డుతున్నారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/