Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి గంటా ఆస్తుల వేలం!

By:  Tupaki Desk   |   18 Nov 2019 6:27 AM GMT
మాజీ మంత్రి గంటా ఆస్తుల వేలం!
X
మీరు చదివింది నిజమే. ఆర్థికంగా స్థితిమంతుడైన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏంది? ఆయన ఆస్తుల్ని వేలం వేయటం ఏమిటంటారా? ఆర్థికంగా మాంచి సౌండ్ అని చెప్పే గంటాకు ఇలాంటి పరిస్థితి ఏమిటని కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆయన ఆస్తుల్ని వేలం వేసే వరకూ విషయం ఎందుకు వచ్చిందన్న అంశంలోకి వెళితే.. ఆసక్తికర అంశాల్ని చెబుతున్నారు.

ప్రత్యేషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ పేరున ఇండియన్ బ్యాంకు నుంచి గంటా వారు తీసుకున్న రుణం లెక్క తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఆయన తీసుకున్న రుణం.. ఏ రూ.5 కోట్లో.. రూ.10 కోట్లో కాదు.. ఏకంగా రూ.209 కోట్లు. అందుకోసం ఆయన తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ.35.35కోట్లు మాత్రమే.

మనం రూ.10లక్షలు బ్యాంకు లోన్ కావాలంటే రూ.20 లక్షల ఆస్తి తనఖా పెడితే కానీ పాజిటివ్ గా రెస్పాండ్ కానీ బ్యాంకులు.. గంటా లాంటి వారి విషయంలో అంత ఉదారంగా ఎందుకు ఉంటాయో? బ్యాంకు నుంచి భారీ ఎత్తున తీసుకున్న అప్పును చెల్లించే విషయంలో గంటా వారు చేతులు ఎత్తేయటంతో.. ఆయన ఆస్తుల్ని వేలానికి పెడుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఇచ్చిన అప్పునకు.. తనఖా పెట్టుకున్న ఆస్తులకు లింకు కుదరని నేపథ్యంలో ఆయన వ్యక్తిగత ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే హక్కు ఉందని బ్యాంకు చెబుతోంది. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ భూముల్ని సైతం తనఖా పెట్టి భారీగా రుణాలు తీసుకున్నట్లుగా గంటా వారి మీద ఆరోపణలు ఉన్నాయి. అయితే.. గతంలో వినిపించిన ఆరోపణలకు.. తాజా రూ.209 కోట్ల రుణానికి లింకు లేదని.. అది వేరే విషయం.. ఇది వేరే విషయంగా చెబుతున్నారు.

వేలానికి రానున్న ఆస్తుల్లో గంటా పేరు మీద ఉన్న విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ప్లాట్ కూడా ఉందంటున్నారు. ఇవే కాక మరిన్ని ఆస్తుల్ని వేలం పెట్టొచ్చంటున్నారు. గతంలో కూడా గంటా ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లుగా వార్తలు వచ్చినా.. అవేమీ వర్కవుట్ కాలేదు.

అప్పట్లో అంటే అధికారపక్షంలో చక్రం తిప్పే స్థానంలో గంటా ఉన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి.. గంటా ఆస్తుల వేలం తప్పదన్న మాట వినిపిస్తోంది. అన్నేసి వందల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న గంటా.. వాటినేం చేసినట్లు? అన్నది ప్రశ్నగా మారింది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే గంటా స్పందించాల్సి ఉంది.