Begin typing your search above and press return to search.

టీడీపీని వెంటాడుతున్న 'ఆగస్టు' సంక్షోభం

By:  Tupaki Desk   |   6 Jun 2019 4:24 AM GMT
టీడీపీని వెంటాడుతున్న ఆగస్టు సంక్షోభం
X
ఏమో గుర్రాం ఎగురావచ్చు.. ప్రత్యర్థుల ధాటికి టీడీపీ చిత్తు కానూ వచ్చు.. రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు..మొన్నటి వరకు బలంగా ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు సీట్లు, పరపతి లేక డమ్మీ అయిపోయాడు. మొన్నటివరకు దేశంలో ఎవ్వరూ ప్రస్తావించని వైఎస్ జగన్ ఏకంగా అఖండ మెజార్టీతో సీఎం అయ్యారు. అందుకే రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదంటారు..

టీడీపీకి ఇప్పుడు ముగ్గురు ప్రత్యర్థులు.. ఒకటి ఆగర్భశత్రువైన వైసీపీ ఏపీలో అధికారంలో ఉండి దూకుడుగా ముందుకెళ్తోంది. ఇక కేంద్రంలో బీజేపీని గద్దెదించాలని ఎన్నికల ముందటి వరకు ప్రయత్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో రావడంతో ప్రధాన శత్రువుగా మారారు. ఇక పక్కరాష్ట్ర సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ లతో పగ పెంచుకొని రెడీగా ఉన్నారు. దీంతో వీరు ముగ్గురిని ఎదుర్కొని నిలబడడం చంద్రబాబుకు కష్టమేనంటున్నారు.

మూలిగే నక్కమీద కొబ్బరిబొండాం పడ్డట్టు ఇప్పుడు టీడీపీని ఆగస్టు సంక్షోభం వెంటాడుతోంది. టీడీపీని షేక్ చేసిన సంక్షోభాలన్నీ ఆగస్టులోనే వచ్చాయి. నాడు 1984 ఆగస్టు.. ఎన్టీఆర్ ను గద్దెదించాడు నాదెండ్ల భాస్కర్ రావు.. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి నాదెండ్ల సీఎం అయ్యారు. ఇక 1995లో కూడా టీడీపీకి ఇదే సంక్షోభం వచ్చింది. లక్ష్మీపార్వతి మాటలు వింటున్నాడని ఎన్టీఆర్ ను ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గద్దెదించాడు చంద్రబాబు.. టీడీపీని హైజాక్ చేసి 30 ఏళ్లుగా సీఎంగా - టీడీపీ అధినేతగా కొనసాగుతున్నారు.

అలా రెండు బలమైన సంక్షోభాలు టీడీపీకి ఆగస్టులోనే వచ్చిపడ్డాయి. అందుకే ఇప్పుడు 2019 ఆగస్టులో మూడో సంక్షోభం వస్తుందా అన్న అనుమానాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ కుదేలైంది. వైసీపీ ధాటికి 23 సీట్లకే పరిమితమైంది. ముగ్గురే ఎంపీలకు పరిమితమైంది. అప్పుడే టీడీపీలో అసంతృప్తులు వచ్చేశాయి. విజయవాడ ఎంపీ కేశినేని తనకు విప్ పదవి ఇచ్చినందుకు అలిగి వద్దన్నారు. చంద్రబాబు తీరుకు మనస్తాపం చెందారు. ఈ కోవలోనే బాబును మరికొంత మంది కూడా వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ దారుణ ఓటమితో టీడీపీ పగ్గాలు మార్చాలన్న వాదన తెరపైకి వచ్చింది. టీడీపీలో చంద్రబాబు పని అయిపోందని.. 2024 వరకు బాబు టీడీపీని నడిపించలేడని వెంటనే పార్టీని నందమూరి ఫ్యామిలీకి ఇచ్చేయాలని వాదిస్తున్నారు. బాబు తర్వాత లోకేష్ కు అంత స్టామినా లేదని.. జూనియర్ ఎన్టీఆర్ పగ్గాలు చేపట్టాలని ఇప్పటికే రాంగోపాల్ వర్మ వంటి వారు ట్విట్టర్ లో కూస్తున్నారు.

బాబుపై వ్యతిరేకంగా ఉన్న వారిని లాగేయాలని బీజేపీ ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. కేశినేని సహా మరో ఎంపీ తమకు టచ్ లో ఉన్నారని ఇటీవల బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆగస్టు వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో ఏం జరుగుతుంది.. ఆగస్టు సంక్షోభం వెంటాడుతుందా అన్న ఆసక్తి పెరిగిపోతోంది.