Begin typing your search above and press return to search.

అఫ్టాన్ లో ఆస్ట్రేలియా సైనికుల బ్లడీ బ్లడింగ్ గేమ్

By:  Tupaki Desk   |   20 Nov 2020 1:30 AM GMT
అఫ్టాన్ లో ఆస్ట్రేలియా సైనికుల బ్లడీ బ్లడింగ్ గేమ్
X
అప్పుడే మిలటరీలో చేరిన జూనియర్ సైనికులు శిక్షణ పొందుతుంటారు....వారంతా రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ కోసం కొందరు అమాయక పౌరులను - ఖైదీలను గురి చూసి కాల్చి చంపుతుంటారు....హెలికాప్టర్ లో కూర్చునేందుకు స్థలం లేదని ఓ ఖైదీని కాల్చిపడేసి హెలికాప్టర్ నుంచి కింద పడేస్తారు....తమ గురి తప్పుతుందో లేదో సరి చూసుకునేందుకు ఆరేళ్ల పసిపాపని సైతం వదలకుండా పైశాచికానందం పొందుతుంటారు...ఇవన్నీ హాలీవుడ్ సినిమాలో జరిగిన సన్నివేశాలు కాదు. 2007-2013 మధ్యకాలంలో అప్ఫానిస్తాన్ లో అఫ్ఘాన్ ఖైదీలపై ఆస్ట్రేలియా సైనికులు సాగించిన నరమేధం తాలూకు సన్నివేశాలు. తాజాగా ఆ రక్త చరిత్ర తాలూకు ఆధారాలు బయటకు రావడంతో ఆస్ట్రేలియా సైనికులు బ్లడీ ‘బ్లడింగ్’ గేమ్ పై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అఫ్ఘనిస్తాన్‌ లో ఆస్ట్రేలియా సైనికుల వికృత క్రీడ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 9/11 దాడుల తర్వాత తాలిబన్, అల్-ఖైదా వంటి టెర్రరిస్ట్ గ్రూపులను తుదముట్టించేందుకు అఫ్ఘానిస్తాన్ లో అమెరికా తన మిత్రరాజ్యాలైన ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల సైనిక దళాలను మోహరించింది. ఆ సమయంలో 39 మంది నిరాయుధ పౌరులను - ఖైదీలను చట్టవిరుద్ధంగా ఆసీస్ దళాలు చంపినట్లు తమకు ఆధారాలు దొరికినట్టు ఆసీస్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ అంగస్ కాంప్‌ బెల్ తెలిపారు. దీనికి గాను ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు. 2007- 2013 మధ్య కాలంలో అఫ్ఘాన్ లో పనిచేసిన సైనిక దళాలకు ఇచ్చిన కొన్ని విశిష్ట సేవా పతకాలను ఉపసంహరించుకుంటామన్నారు. ఈ వ్యవహారంపై అంతర్జాతీయ స్థాయిలో పెను దుమారం రేపడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ యుద్ధ నేరాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక పరిశోధకుడిని నియమిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ ప్రకటించారు. మరోవైపు, దర్యాప్తు పేరుతో మీడియాపై కూడా కొందరి నియంత్రణ తీవ్రంగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి.