Begin typing your search above and press return to search.

మోడీ పై ప్ర‌శంస‌లు..పాక్‌ కు పంచ్‌ లు వేసిన ముస్లిం ర‌చ‌యిత

By:  Tupaki Desk   |   26 Feb 2019 5:23 PM GMT
మోడీ పై ప్ర‌శంస‌లు..పాక్‌ కు పంచ్‌ లు వేసిన ముస్లిం ర‌చ‌యిత
X
ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ దాడిపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాలు, ఆయా దేశాల్లో వివిధ వ‌ర్గాలు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నాయి. భారత వాయుసేన పాకిస్థాన్‌ లోకి దూసుకెళ్లి అక్కడి టెర్రరిస్టు క్యాంపులను తుడిచి పెట్టడంపై ఆస్ట్రేలియాకు చెందిన ముస్లిం రచయిత ఇమామ్ మహ్మద్ తవ్హిది ప్రశంసల వర్షం కురిపించారు. అటు పాక్ పై సెటైర్లు వేస్తూ.. ఇటు భారత్ ను పొగుడుతూ వరుస ట్వీట్లు చేశారు. ఇందులో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై సైతం ఆయ‌న పొగ‌డ్త‌లు కురిపించ‌డం గ‌మ‌నార్హం.

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్ల ఎన్నో ఏళ్లుగా భారత్ ఇబ్బందిపడుతోందని - ఇటీవలే దాదాపు 50 మంది జవాన్లు అమరులయ్యారని అన్నారు. పాకిస్థాన్ లాంటి బాధ్యతా రాహిత్యమైన ప్రభుత్వాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడలేమని ఇమామ్ చెప్పారు. ఇప్పుడు కూడా ఆ దేశం చెప్పే దాన్ని ప్రపంచం నమ్మదని అన్నారు. దీనిపై ఐక్యరాజ్య సమితి కలగజేసుకోవాలని అన్నారు. ఒకప్పుడు పాకిస్థాన్ కూడా భారత్ లో భాగమేనని ఇమామ్ అన్నారు. పాక్ లో ఎక్కడ సమస్య ఉందో - దాన్ని ఎలా పరిష్కరించాలో ఇండియాకు తెలుసని చెప్పారు. ‘భారత యుద్ధ విమానాలు 1000 కేజీల బాంబులను వేసి పాక్ లోని ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచి పెట్టేశాయి. కానీ పాక్ మాత్రం ఇండియా సరిహద్దు దాటి వచ్చిందంటూ కంప్లెయింట్ చేస్తోంది. సిగ్గు లేకుండా టెర్రరిస్టులను కాపాడుతోంది’ అని ఇమామ్ మహ్మద్ ట్వీట్ చేశారు.

ఈ సంద‌ర్భంగా పాకిస్థాన్‌ కు ఊహించ‌ని ప్ర‌తిపాద‌న పెట్టారు. ‘తాము ఉగ్ర బాధితులమేనని చెబుతూ పాకిస్థాన్ విదేశాల నుంచి కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకుంటోంది. కానీ ఉగ్రవాదంపై పోరాటంలో ఆ దేశం ఫెయిల్ అవుతూనే ఉంది. అయితే భారత్ 1000 కిలోల బాంబులు వేసి టెర్రరిస్టు స్థావరాలను తుడిచిపెట్టింది. పాకిస్థాన్ సమస్యను క్లియర్ చేసింది. భారత్ చేసిన పనికి ఇప్పడు పాకిస్థాన్ బిల్లు (డబ్బు) కట్టాలి’ అని ఆయన చెప్పారు. పాకిస్థాన్ లోని టెర్రరిజంపై పోరాడుతూ భారత ప్రధాని మోడీ దాయాది దేశాన్ని మార్చేస్తున్నారంటూ ‘పీఎం మోడీ ఈజ్ మోడి-ఫైయింగ్ పాకిస్థాన్’ (PM Modi is Modi-fying Pakistan) అని ఇమామ్ మహ్మద్ ట్వీట్ చేశారు.