Begin typing your search above and press return to search.

భారత్ నుంచి వెళ్తే జైలుశిక్షేన‌ట‌.. ఐపీఎల్ ఆట‌గాళ్ల ప‌రిస్థితేంటీ?

By:  Tupaki Desk   |   2 May 2021 2:30 AM GMT
భారత్ నుంచి వెళ్తే జైలుశిక్షేన‌ట‌.. ఐపీఎల్ ఆట‌గాళ్ల ప‌రిస్థితేంటీ?
X
భార‌తదేశంలో క‌రోనా విల‌యం క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 4 ల‌క్ష‌ల ఒక వెయ్యి పైచిలుకు కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో ప్ర‌తీ ఐదుగురిలో ఒక‌రికి వైర‌స్ సోకింద‌ని వారం క్రిత‌మే నిపుణులు అంచ‌నా వేశారు. ఇప్పుడు ఆ సంఖ్య మ‌రింత పెరిగే అవకాశం ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌పంచ దేశాల‌న్నీ అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. భార‌త్ స‌హ‌కారం అందించేందుకు ముందుకు వ‌స్తూనే.. ఇక్క‌డి నుంచి త‌మ దేశాల‌కు వ‌చ్చే వారిప‌ట్ల క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తున్నాయి.

తాజాగా.. ఆస్ట్రేలియా మ‌రింత క‌ఠిన నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. ఆ నిర్ణ‌యం త‌మ దేశ‌పౌరుల‌ను కూడా దూరంగా పెట్టింది. భార‌త్ లో ఉన్న ఆస్ట్రేలియా పౌరులు తిరిగి స్వ‌దేశం చేరుకుంటే ఐదేళ్ల‌పాటు జైలు శిక్ష విధిస్తామ‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. అంతేకాకుండా.. 66 వేల డాల‌ర్ల జ‌రిమానా కూడా విధిస్తామ‌ని హెచ్చ‌రించింది. ఈ నిబంధ‌న‌లు నేటినుంచి (శ‌నివారం) అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని వెల్ల‌డించింది.

అయితే.. నిర్ణయంతో ఐపీఎల్ ఆట‌గాళ్ల ప‌రిస్థితి ఏంట‌న్న‌ది అర్థంకాకుండా ఉంది. ఐపీఎల్ లో ఆస్ట్రేలియాకు చెందిన వారి సంఖ్య తక్కువేమీ లేదు. ఆట‌గాళ్లు, కోచ్ లు, వ్యాఖ్యాత‌లు క‌లిసి దాదాపు 30 మందికిపైనే ఉన్నారు. వీరిలో ఇప్ప‌టికే ప‌లువురు క్రికెటర్లు విమానం ఎక్కేశారు. వారిలో.. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ఆండ్రూ టై, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చెందిన కేన్ రిచర్డ్‌సన్, అడమ్ జంపా స్వ‌దేశానికి వెళ్లిపోయారు.

ఇంకా మిగిలిన వాళ్లు కూడా ఐపీఎల్-14 సీజ‌న్ కు గుడ్ బై చెప్పేందుకు చూస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. వారిలో ప్ర‌ధానంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఢిల్లీ ప్లేయ‌ర్‌ స్టీవ్ స్మిత్ కూడా లైన్లో ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. వీరు ఆయా జ‌ట్ల‌కు ప్ర‌ధాన బ‌లంగా ఉన్నారు. వీరువెళ్లిపోతే ఆయా జ‌ట్ల‌కు గ‌ట్టిదెబ్బే త‌గులుతుంది.

ఇప్ప‌టికే.. ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌పై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా దారుణ ప‌రిస్థితుల్లో కోట్లాది రూపాయ‌లు వెచ్చించి, ఈ టోర్నీ నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని అంటున్నారు. ఓ మీడియా సంస్థ సైతం ఐపీఎల్ వార్త‌లు ప్ర‌చురించొద్ద‌ని నిర్ణ‌యించుకుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఐపీఎల్ పై జ‌నం దృష్టి కాస్త త‌గ్గింద‌నే చెప్పొచ్చు. ఇప్పుడు ఆసీస్ కీల‌క ఆట‌గాళ్లు కూడా వెళ్లిపోతే.. క్రేజ్ మ‌రింతగా త‌గ్గిపోతుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి, ఎంత‌మంది వెళ్లిపోతారో చూడాలి.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ ఆడుతున్న‌ క్రికెట‌ర్లు.. తిరిగి ఆస్ట్రేలియా వెళ్లే విష‌యంలో మిన‌హాయింపు ఇచ్చే అవ‌కాశాన్ని అక్క‌డి ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంద‌ట‌. మ‌రి, ఫైన‌ల్ గా ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న‌ది చూడాలి. కాగా.. భార‌త్ నుంచి వెళ్లే విమానాల‌పై ఆస్ట్రేలియా తాత్కాలిక‌ నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ నిషేధాన్ని మే 15 వ‌ర‌కు పొడిగించింది.