Begin typing your search above and press return to search.

పిచ్చి పీక్‌ స్టేజీకి వెళ్లడం అంటే ఇదే..

By:  Tupaki Desk   |   26 May 2015 10:48 AM GMT
పిచ్చి పీక్‌ స్టేజీకి వెళ్లడం అంటే ఇదే..
X
అరాచక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ ఆండ్‌ సిరియా(ఐఎస్‌ఐఎస్‌) గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. సామాన్య పౌరులు, చిన్నారులు, పాత్రికేయులు, ప్రభుత్వ బలగాలు, మహిళలు అనే తేడా లేకుండా అరాచకంగా, కిరాతకంగా చంపేస్తున్న విషయం తెలిసిందే. గడిచిన తొమ్మిది రోజుల్లో దాదాపు 217 మందిని ఐఎస్‌ఐఎస్‌ కిరాతకులు నిర్దాక్షిణ్యంగా ఉరితీసినట్లు సిరియా హక్కుల సంస్థ తాజాగా ఒక రిపోర్టు విడుదల చేసింది. దీన్ని చూసి అంతా అవాక్కయ్యారు. కానీ మూర్ఖత్వం నిండా జీర్ణించుకుపోయిన ఓ ఆస్ట్రేలియన్‌ మహిళ తన ఇద్దరు బిడ్డలను వదిలేసి ఆ సంస్థలో చేరేందుకు వెళ్లింది !!



ఆస్ట్రేలియాకు చెందిన జాస్మానియా మిలోవానోవ్‌ అనే మహిళ అనుమానాస్పదంగా సిడ్నీ విడిచి వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా...ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం తాను ఐఎస్‌ఐఎస్‌ లో చేరబోతున్నట్లు పరోక్షంగా ఇంట్లో వాళ్లకు చెప్పినట్లు తేలింది. ఐఎస్‌ఐఎస్‌ లో చేరేందుకు వెళ్తున్నట్లు సోదరికి తెలపడమే కాకుండా...తానిక ఎప్పటికీ ఇంటిమొఖం చూడనని చెప్పి వెళ్లిపోయిందట.



ఐఎస్‌ఐఎస్‌ లో చేరడమే వింత అనుకుంటే.. తన ఇద్దరు బిడ్డలను వదిలేసి మరీ వెళ్లడం ఘోరం. ఈ ఘనకార్యాన్ని తన మాజీ భర్తకు కూడా ఆమె తెలియజేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన షాక్‌ కు లోనయ్యారు. ''ఆమె చేసిన పనికి నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఇప్పుడు నా చిన్నారుల గురించే ఆలోచిస్తున్నాను. వారిని వదిలి ఎలా వెళ్లబుద్దయిందో అర్థం కావడం లేదు'' అని ఆయన వాపోయారు.

పిచ్చి పరాకాష్టకు చేరిన వారు ఇలా చేయకుంటే ఇంకేం చేస్తారు. కన్న పిల్లల కంటే..కలలు కనే మూర్ఖపు ప్రపంచమే వారికి గొప్ప.