Begin typing your search above and press return to search.

మ‌రోమారు వార్త‌ల్లో బెండ‌పూడి.. ఈసారి ఇలా!

By:  Tupaki Desk   |   23 Sep 2022 4:30 PM GMT
మ‌రోమారు వార్త‌ల్లో బెండ‌పూడి.. ఈసారి ఇలా!
X
తూర్పుగోదావ‌రి జిల్లాలోని బెండ‌పూడి ఇప్ప‌టికే చాలా ప్ర‌సిద్ధి చెందింది. బెండ‌పూడి ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థులు అన‌ర్ఘ‌ళంగా, అమెరిక‌న్ యాక్సెంట్‌తో ఇంగ్లిష్‌లో మాట్లాడ‌టం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. స్వ‌యంగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ విద్యార్థుల‌ను గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలోని సీఎం కార్యాల‌యానికి పిలిపించి విద్యార్థుల భాషా ప‌టిమ‌ను మెచ్చుకున్నారు. విద్యార్థుల‌ను, వారికి ఇంగ్లిష్‌లో వారిని అద్భుతంగా తీర్చిదిద్ద‌న ఉపాధ్యాయుల‌ను అభినందించారు. అయితే అదంతా బ‌ట్టీ కొట్టించి మాట్లాడించార‌ని.. విద్యార్థుల‌కు స‌హ‌జ‌సిద్ధంగా అబ్బిన ఇంగ్లిష్ కాద‌ని తీవ్ర ట్రోలింగ్, సెటైర్లు కూడా సోష‌ల్ మీడియాలో న‌డిచాయి.

ఈ నేప‌థ్యంలో బెండ‌పూడి ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థుల ఇంగ్లిష్ ఖండాంత‌రాలు దాటింది. యూట్యూబ్‌లో బెండపూడి విద్యార్థుల ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని చూసిన ఆయా దేశాల ప్ర‌తినిధులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. భార‌త్‌లో అమెరికా రాయ‌బారి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా బెండ‌పూడి విద్యార్థుల‌తో ఆంగ్లంలో సంభాషించి వారిని మెచ్చుకున్నారు. వారి భాషా నైపుణ్యాన్ని కొనియాడారు. అమెరిక‌న్ విద్యార్థుల‌తోనూ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌తి ఆదివారం బెండ‌పూడి విద్యార్థులు చ‌ర్చ‌ల్లో పాల్గొంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఒక ఆస్ట్రేలియా టీచ‌ర్ సైతం బెండ‌పూడి విద్యార్థుల ఇంగ్లిష్ భాషా నైపుణ్యాల‌కు అచ్చెరువొందారు. ఆస్ట్రేలియా టీచ‌ర్ యూట్యూబ్‌లో విద్యార్థులు ఇంగ్లీష్‌పై సాధించిన పట్టు చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. స్వ‌యంగా విద్యార్థుల‌ను క‌లుసుకోవాల‌ని ఖండాంత‌రాలు దాటి ఆస్ట్రేలియా నుంచి ఇండియాలోని బెండ‌పూడికి వ‌చ్చారు. అక్క‌డ విద్యార్థులతో సంభాషించారు. వారి భాషా నైపుణ్యాల‌ను ప‌రిశీలించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థులు ఈ స్థాయిలో ఇంగ్లిష్ పై ప‌ట్టు సాధించ‌డం తాను ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌లేద‌న్నారు. అందుకే వారిని స్వ‌యంగా ప‌రిశీలించాల‌ని బెండ‌పూడికి వ‌చ్చాన‌ని తెలిపారు.

బెండ‌పూడికి వ‌చ్చిన ఆస్ట్రేలియా టీచ‌ర్ వివియాన్.. రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న మ‌న‌బ‌డి: నాడు-నేడు పథకం గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. బెండ‌పూడిలో అమ‌లు చేస్తున్న‌ లాంగ్వేజ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రామ్ తీరుతెన్నుల‌ను అడిగి తెలుసుకున్నారు. లెర్న్ ఎ వర్డ్ ఎ డే కార్యక్రమం కింద రోజుకు ఐదు ప‌దాల‌ చొప్పున నేర్చుకున్నామని విద్యార్థులు ఆస్ట్రేలియా టీచ‌ర్ వివియాన్ కు వివ‌రించారు. వంద రోజుల్లో 1,500 పదాలు నేర్చుకునే విధంగా త‌మ ఉపాధ్యాయులు ఒక ఫార్మాట్‌ రూపొందించారని ఆమెకు తెలిపారు. రోజూ ఉదయం స్కూల్‌లో తొలి పావు గంట ఈ పదాలపై ఉపాధ్యాయులు త‌మ‌కు శిక్ష‌ణ ఇచ్చార‌న్నారు.

మీరు రాక‌ముందు గ‌తంలో తాము అమెరికా రాయ‌బారితో తాము వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన‌ట్టు విద్యార్థులు ఆస్ట్రేలియా టీచ‌ర్ వివియాన్ కు వివ‌రించారు. త‌మ ఉపాధ్యాయులు అమెరికా విద్యార్థుల‌తో వివిధ అంశాల‌పై చ‌ర్చించే అవ‌కాశం కూడా క‌ల్పించార‌న్నారు. త‌మ పాఠ‌శాల‌లో ప్ర‌స్తుతం ఉన్న విద్యార్థుల్లో స‌గానికిపైగా ఆంగ్లంలో సంభాషిస్తున్నార‌ని తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.