Begin typing your search above and press return to search.

మాజీమంత్రి అఖిల‌ప్రియ‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   4 Jun 2020 11:30 AM GMT
మాజీమంత్రి అఖిల‌ప్రియ‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
క‌ర్నూలు జిల్లాకు చెందిన‌ మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి. తనను హ‌త‌మార్చ‌డానికి అఖిలప్రియ దంపతులు ప్రయత్నించారని.. దానికోసం రూ.కోటి ఒప్పందం చేసుకున్నారని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. దానికి సంబంధించిన వివరాలు కూడా వెల్ల‌డించారు. రామిరెడ్డి, రవిచంద్రారెడ్డిల‌కు చెరో రూ.50 లక్షలకు సుపారీ మాట్లాడార‌ని తెలిపారు. వారిని పోలీసులు అరెస్ట్ చేస్తే విషయం బయటకు వస్తుందని తెలిపి పోలీసులు విచార‌ణ చేయాల‌ని డిమాండ్ చేశారు. త‌న హ‌త్య‌కు సుపారీ డ‌బ్బులు భూమా అఖిలప్రియ పీఏ డబ్బులు ఇచ్చారని వివ‌రించారు. త‌న హ‌త్య విష‌య‌మై మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నారని.. వారిలో ఏ4 అఖిలప్రియ‌, ఏ5గా ఆమె భర్త భార్గవ్ ఉన్నారని తెలిపారు. అయితే కడప జిల్లా పోలీసులు లేకపోతే తాను ఇప్ప‌టికే హత్యకు గుర‌య్యే వాడిన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఏవీ సుబ్బారెడ్డి హత్యకు ఓ ముఠా కుట్ర పన్నిన విష‌యం పోలీసుల‌కు తెలిసింది. ప‌క్కా స‌మాచారం రావ‌డంతో మార్చి నెల‌లో కడప చిన్నచౌక్‌ పోలీసులు రంగంలోకి దిగారు. సుబ్బారెడ్డి హ‌త్య‌కు సుపారి తీసుకున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా వారి నుంచి రూ.3.20 లక్షల నగదు, ఓ పిస్తోలును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యాయత్నం కేసులో ముఖ్య సూత్రధారిగా భావిస్తున్న మాదా శ్రీనివాసులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు జరిపిన చేసిన లావాదేవీల్లో శ్రీనివాసులు ముఖ్య పాత్ర పోషించినట్లు తేలింది. దీంతో అత‌డిపై విచార‌ణ సాగుతోంది.

అఖిల‌ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డికి సుబ్బారెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉండేవారు. నాగిరెడ్డి మృతి తర్వాత భూమా ఫ్యామిలీతో ఆయ‌న‌కు విభేదాలు మొదలయ్యాయి. అఖిలప్రియ, సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. దీంతో పార్టీ రెండుగా చీలింది. ఈ సమ‌యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించి వారి మ‌ధ్య స‌యోధ్య‌కు ప్ర‌య‌త్నించారు. వారితో పిలిచి మాట్లాడినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. అయితే సార్వ‌త్రిక ఎన్నికల్లో ఈ విబేధాలు తీవ్ర ప్ర‌భావం చూప‌డంతో అఖిలప్రియ ఓడిపోయింది. ఏవీ సుబ్బారెడ్డి రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. అయితే త‌న ఓట‌మికి సుబ్బారెడ్డి కార‌ణంగా అఖిల‌ప్రియ భావిస్తోంది. ప్ర‌శాంతంగా ఉన్న స‌మ‌యంలో అఖిల‌ప్రియ సుబ్బారెడ్డిపై ఈ విధంగా హ‌త్య చేయించాల‌నుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. అయితే సుబ్బారెడ్డిపై ఎవ‌రు చేయించింద‌నే విష‌యం ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌దు.