Begin typing your search above and press return to search.

హోదాకి బాబే అడ్డంకి..టీడీపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   14 Feb 2019 1:13 PM GMT
హోదాకి బాబే అడ్డంకి..టీడీపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఓ వైపు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతూ...తాయిలాల వ‌ర‌ద కురిపిస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు...షాకుల ప‌రంపర కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌జాప్ర‌తినిధుల్లో ఒక్కొక్క‌రు తెలుగుదేశం పార్టీకి గుడ్‌ బై చెప్తున్నారు. తాజాగా, అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీకి గుడ్‌ బై చెప్పేశారు. లోటస్‌ పాండ్‌ లో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం అవంతి మీడియాతో మాట్లాడుతూ..సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేసిన తర్వాతే వైఎస్‌ జగన్‌ ను కలిసినట్లు అవంతి శ్రీ‌నివాస్‌ వెల్లడించారు. పూటకో మాట మార్చే చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు అవినీతి కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా రాలేదని అవంతి శ్రీ‌నివాస్ ప్ర‌క‌టించారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేద్దామంటే చంద్రబాబు అడ్డుపడ్డారని చెప్పారు. ఇన్నిరోజులు బీజేపీతో జతకట్టి, ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి నాటకం ఆడుతున్నారని అవంతి శ్రీనివాస్ విమర్శించారు. తాను ఏది చెబితే అది ప్రజలు నమ్ముతున్నారనే భ్రమలో చంద్రబాబు ఉంటారని, ప్రజలను పెద్ద గందరగోళంలోకి తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. ఆయనకు నచ్చిన విధంగా చేస్తే మంచివాళ్లు, లేకుంటే చెడ్డవాళ్లగా ముద్రకొట్టడం అలవాటేనని మండిప‌డ్డారు.

ప్రత్యేక హోదా కోసం జగన్ రాజీలేని పోరాటం చేస్తున్నారని అవంతి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజానీకంలో చైతన్యం వచ్చిందని, ప్రజలు సైతం జగన్ సిఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకున్నారని అన్నారు. భీమిలి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వలేదని పార్టీ మారడం లేదని తేల్చి చెప్పిన అవంతి శ్రీనివాస్ , పార్టీ విధానాలు నచ్చకనే వైసీపీలో చేరానని వివ‌రించారు. జగన్ నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలందరికీ ఉందని విజ్ఞప్తి చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబేన‌ని, వైఎస్‌ జగన్‌ తోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అవంతి పేర్కొన్నారు.