Begin typing your search above and press return to search.

వైసీపీ మాజీ మంత్రి రగిలిపోతున్నారా...?

By:  Tupaki Desk   |   7 Jan 2023 2:30 AM GMT
వైసీపీ మాజీ మంత్రి రగిలిపోతున్నారా...?
X
ఆయన మాజీ మంత్రి. బలమైన కాపు సామాజికవర్గం నాయకుడు. విశాఖ జిల్లా భీమిలీ సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అధినాయకత్వం మీద పెద్ద ఎత్తున రగులుతున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన వైసీపీ జిల్లా నేతలతో టచ్ లో ఉండడంలేదు అని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

అదే టైం లో ఆయన పార్టీలో సంతృప్తిగా లేరని అంటున్నారు. తాను మచ్చ లేకుండా తన శాఖకు మంత్రిగా పని చేస్తే తీసేశారు అన్న బాధ ఆయనకు ఉంది. అయితే జిల్లా ప్రెసిడెంట్ పదవిని అప్పగించి కొంతలో కొంత ఊరటను కలిగించారు. అయితే ఆ పదవిని కూడా ఇటీవల చటుక్కున లాగేశారు. తెచ్చి మరీ పార్టీలో తన వెనకాల వచ్చిన పంచకర్ల రమేష్ బాబుకు ఇచ్చారన్న వేదనతో ఆయన ఉన్నారని అంటున్నారు.

పంచకర్ల సైతం కాపు సామాజికవర్గం నేత కావడంతో పాటు ఆయనను భీమిలీ నుంచి బరిలోకి దింపుతారు అన్న టాక్ తో ఇపుడు అవంతి ఇంకా రగులుతున్నారని అంటున్నారు. పంచకర్ల రమేష్ బాబుని ఒక పధకం ప్రకారమే పార్టీ ప్రోత్సహిస్తోందని, తనను దెబ్బ తీయడానికే అని అవంతి అనుమానిస్తున్నారుట. నిజానికి అవంతి పంచకర్ల ఇద్దరూ 2009 టైం లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ఎంట్రీని ఇచ్చారు. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఇద్దరూ గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు.

ఇద్దరూ ఆ తరువాత టీడీపీలోకి వచ్చి పదవులు అందుకున్నారు. ఇక 2019లో పంచకర్ల టీడీపీ తరఫున ఎలమంచిలికి పోటీ చేసి ఓడారు. ఆ తరువాతనే ఆయన వైసీపీలోకి వచ్చారు. చిత్రమేంటి అంటే ఇద్దరూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సహచరులే. ఇలా ఇద్దరూ ఒకనాడు సఖ్యతగానే ఉండేవారు. వైసెపీలో మాత్రం పంచకర్ల ఎంట్రీ వరకూ ఓఅకే అనుకున్నా ఇపుడు తన అవకాశాలకే ఆయన గండి కొట్టడమే అవంతికి నచ్చడంలేదు అంటున్నారు.

ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో తనకు వైసీపీ టికెట్ దక్కదని కన్ ఫర్మ్ చేసుకుంటున్న మాజీ మంత్రి ఈ ఆవేశంతో తన పాత పార్టీ తెలుగుదేశంలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. చంద్రబాబుకు ఇంతకాలం విమర్శిస్తూ వచ్చిన అవంతి ఇటీవల పూర్తిగా మానేశారు. అదే టైం లో అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వం మీద ఇండైరెక్ట్ సెటైర్లు వేస్తున్నారు అని అంటున్నారు. ఆ మధ్యన తన నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి కోట్లు ఖర్చు పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి జేబుల్లో నుంచి ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోయారని గుర్తు చేస్తున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే అవంతి టీడీపీలోకి వచ్చినా ఆయనకు భీమిలీ టికెట్ ఇస్తారా అన్నదే డౌట్ అంటున్నారు. ఆయన చంద్రబాబు నమ్మకాన్ని దెబ్బ కొట్టి 2019 ఎన్నికల వేళ వైసీపీలోకి వెళ్లారని, అక్కడ మంత్రిగా ఉంటూ ఎన్నో మాటలు అన్నారని ఇపుడు అక్కడ కుదరక తమ పార్టీలోకి వస్తే చేర్చుకుంటామా అని తమ్ముళ్ళు అంటున్నారు. భీమిలీ సీటుకు మంచి కాంపిటీషన్ ఉంది. దాంతో పాటు లోకల్ క్యాండిడేట్ కే టికెట్ అన్న డిమాండ్ ఉంది. ఈ నేపధ్యంలో అవంతి శ్రీనివాస్ ఏ హామీ పుచ్చుకుని సైకిలెక్కుతారు అన్నదే ప్రశ్నగా ఉంది. ఇక ఆయన పార్టీ మారుతారు అన్న ప్రచారం జరుగుతున్నా వైసీపీ లైట్ తీస్కోవడం బట్టి అవంతికి అంత సీన్ ఇవ్వకూడదనే అనుకుంటున్నారని తెలుస్తోంది.