Begin typing your search above and press return to search.

గంటాకు అవంతి షాకివ్వ‌నున్నారా?

By:  Tupaki Desk   |   3 Jun 2018 4:53 AM GMT
గంటాకు అవంతి షాకివ్వ‌నున్నారా?
X
టీడీపీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు ఇటీవ‌ల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. రాష్ట్రంలో చంద్ర‌బాబు పాల‌న మీద ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త అంత‌కంత‌కూ ఎక్కువ కావ‌టంతో.. తెలుగు త‌మ్ముళ్ల‌లో తీవ్ర మ‌ధ‌నంలో ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. ఎంత‌కూ మార‌ని అధినేత‌తో ఉండి మునిగిపోవ‌టం కంటే.. ముందుగా మేల్కొని పార్టీ మారిపోవ‌టం మంచిద‌న్న భావ‌న‌లో ప‌లువురు త‌మ్ముళ్లు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఈ దిశ‌గా ఇప్ప‌టికే ప‌లువురు టీడీపీ నేత‌లు.. ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ ను సంప్ర‌దిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య‌నేత‌ల తీరు ఆ జిల్లా రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అన‌కాప‌ల్లి ఎంపీ.. టీడీపీ నేత అవంతి శ్రీ‌నివాస‌రావు తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

టీడీపీ ఎంపీగా గెలిచిన ఆయ‌న‌.. ఈసారి త‌న గెలుపు మీద అనుమానాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న అసంతృప్తితో రాజ‌కీయంగా త‌న‌కు త‌గిలే ఎదురుదెబ్బ‌ను త‌ప్పించుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇందులో భాగంగా ఈసారి ఎంపీగా పోటీకి దిగ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా తెలుస్తోంది. 2019లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అసెంబ్లీ బ‌రిలో దిగాల‌ని డిసైడ్ అయిన‌ట్లు చెబుతున్నారు. అది కూడా రాష్ట్ర మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భీమిలీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు చెబుతున్నారు.

2009లో తొలిసారి ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి భీమిలీ నుంచి ఎన్నికైన అవంతి 2014లో అనకాప‌ల్లి నుంచి టీడీపీ ఎంపీగా విజ‌యం సాధించారు.

మ‌రోసారి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రి ప‌ద‌విని చేప‌ట్టాల‌న్నది అవంతి ఆలోచ‌న‌గా చెబుతున్నారు. ఇందులో భాగంగా గ‌తంలో తాను ప్రాతినిధ్యం వ‌హించిన భీమిలీ నుంచి పోటీ చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. గంటా అడ్డుగా ఉండ‌టంతో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి బ‌రిలోకి దిగాల‌న్న ఆలోచ‌న‌లో అవంతి ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన సంప్ర‌దింపులు ఇప్ప‌టికే మొద‌లుపెట్టిన‌ట్లుగా చెబుతున్నారు.

అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా ఉండేలా గంటా పావులు క‌దుపుతున్న‌ట్లుగా తెలుస్తోంది. భీమిలీ బ‌రిలో గంటా దిగితే రాజ‌కీయంగా త‌న‌కు న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని.. అందుకే ఆయ‌న జోరుకు అడ్డుక‌ట్ట వేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. అవంతి మాత్రం జ‌గ‌న్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లుగా స‌మాచారం. ఈ వ్య‌వ‌హారంపై క్లారిటీ రావాలంటే అవంతి నోరు విప్పాల్సి ఉంటుంది. మ‌రి.. గంటాకు అవంతి ఎలాంటి షాక్ ఇస్తున్నార‌న్న‌ది కాస్త వెయిట్ చేస్తే మ‌రింత క్లారిటీ వ‌స్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.