Begin typing your search above and press return to search.

కష్టాల్లో ఆ వైసీపీ మాజీ మంత్రి!

By:  Tupaki Desk   |   28 Nov 2022 8:54 AM GMT
కష్టాల్లో ఆ వైసీపీ మాజీ మంత్రి!
X
అవంతి శ్రీనివాసరావు.. పరిచయం అక్కర్లేని పేరు. అవంతి విద్యా సంస్థల అధినేతగా ఆయన ఉన్నారు. ప్రస్తుతం ఆయన కష్టకాలంలో ఉన్నారని టాక్‌ నడుస్తోంది. ఇటీవల వైఎస్‌ జగన్‌ రెండోసారి తన మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు పర్యాటక, క్రీడల శాఖ మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్‌ను తొలగించారు. ఆయనకు విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు.

అయితే ఇటీవల ఓ మహిళతో అవంతి శ్రీనివాస్‌ డర్టీ టాక్‌ నడిపారంటూ ఒక ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇది ఒకటే కాదు గతంలో అంటే మంత్రిగా ఉన్నప్పుడు కూడా గంట, అర గంట చాలు అంటూ అవంతి శ్రీనివాసరావు ఒక మహిళతో మాట్లాడిన ఆడియో క్లిప్‌ అంటూ ఒకటి బాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ప్రతిపక్షాలు కూడా ఈ వ్యవహారంలో అవంతి శ్రీనివాస్‌పై తీవ్ర విమర్శలు చేశాయి.

2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున భీమిలి ఎమ్మెల్యేగా గెలుపొందిన అవంతి శ్రీనివాస్‌ 2014లో టీడీపీలో చేరి అనకాలపల్లి ఎంపీగా గెలుపొందారు. మళ్లీ తిరిగి 2019లో వైసీపీలో చేరి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జగన్‌ తొలి విడత మంత్రివర్గంలో పర్యాటక, క్రీడలు శాఖ మంత్రిగా చాన్సు కొట్టేశారు.

అయితే మహిళలతో ఆడియో క్లిప్‌ల వ్యవహారం అవంతి శ్రీనివాస్‌ ప్రతిష్టను బాగా మసకబార్చింది. మరోవైపు విశాఖలో తాను మంత్రిగా ఉన్నా విజయసాయిరెడ్డి చక్రం తిప్పుతున్నారని గతంలో అవంతి కినుక వహించినట్టు ప్రచారం జరిగింది. విజయసాయిపైన జగన్‌కు సైతం ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు మహిళలతో ఆడియో క్లిప్పుల వ్యవహారమే కానీ, మరొకటే కానీ అవంతి మంత్రి పదవీ పోయింది. అలాగే పార్టీ అధ్యక్ష పదవి పోయింది. ప్రస్తుతం విశాఖ, అనకాపల్లి జిల్లాల రీజినల్‌ వైసీపీ కోఆర్డినేటర్‌గా వైవీ సుబ్బారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా అవంతిని చేరదీయడం లేదంటున్నారు.

మరోవైపు ఉత్తరాంధ్రలో కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా, ఓటమి ఎరుగని నేతగా అరుదైన రికార్డు ఉన్న గంటా శ్రీనివాసరావును వైసీపీలోకి ఆహ్వానిస్తారనే చర్చ జరుగుతోంది. డిసెంబర్‌ మొదటివారంలో గంటా వైసీపీలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు.

గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరితే గంటాకు భీమిలి సీటు కేటాయించే అవకాశం ఉంది. ఎందుకంటే 2009లో గంటా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలుపొందారు. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా గంటాకు భీమిలి సీటు కేటాయించే చాన్సు ఉంది.

దీంతో అవంతి శ్రీనివాసరావు గంటా రాకను వ్యతిరేకిస్తున్నారని టాక్‌ నడుస్తోంది. గతంలో సైతం గంటా వైసీపీలో చేరడానికి చేసిన ప్రయత్నాలను అధిష్టానానికి చెప్పి అవంతి అడ్డుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అవంతిని వదిలేసి గంటాను చేరదీసే పనిలో వైసీపీ ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అవంతికి కష్టకాలం మొదలైనట్టేనని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.