Begin typing your search above and press return to search.

ఫ్లైట్ ప్ర‌యాణికుల‌కు స్వీట్ న్యూస్‌!

By:  Tupaki Desk   |   6 April 2018 4:48 AM GMT
ఫ్లైట్ ప్ర‌యాణికుల‌కు స్వీట్ న్యూస్‌!
X
ఒక‌ప్పుడు విమాన ప్ర‌యాణం అంటే కొద్దిమందికి సంబంధించిన విష‌యం. చౌక‌ధ‌ర‌ల‌తో విమాన‌ప్ర‌యాణాలు అందుబాటులోకి వ‌చ్చాక‌.. చాలామంది ఫ్లైట్ జ‌ర్నీలు త‌ర‌చూ చేస్తున్నారు. ఒక‌ప్పుడు ఫ్లైట్ ఎక్క‌టం జీవిత కాల కోరిక‌లా ఉండేది. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేదు.

డ‌బ్బు కంటే కాలం చాలా కీల‌కం కావ‌టం.. ఇందుకు త‌గ్గ‌ట్లు ఒక‌ప్పుడు ఆకాశంలో ఉండే విమాన టికెట్లు నేల మీద‌కు రావ‌టం.. ఇంచుమించు త్రీ టైర్ ఏసీ టికెట్ల‌తో స‌మానంగా ఉండ‌టంతో విమానాల్లో ప్ర‌యాణించే వారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే.. విమాన ప్ర‌యాణాల్లో త‌ర‌చూ ఎదుర‌య్యే ఇబ్బందుల విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కూ మార్పులు లేకుండా పోవ‌టంతో త‌ర‌చూ పెద్ద ఎత్తున ప్ర‌యాణికులు ఇబ్బందులు ప‌డుతున్న ప‌రిస్థితి.

విమాన స‌ర్వీసుల్ని ర‌ద్దు చేయ‌టం. విమాన రాక‌పోక‌ల్లో జాప్యం చోటు చేసుకోవ‌టం.. సామాను గ‌ల్లంతు కావ‌టం.. దెబ్బ తిన‌టం లాంటి స‌మ‌స్య‌ల‌కు సంబంధించిన ప‌రిహారాన్ని అందించే విష‌యంపై ప్ర‌యాణికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఇలాంటి వాటికి చెక్ చెప్పేలా కేంద్ర విమాన‌యాన మంత్రిత్వ శాఖ తాజాగా కొన్ని ప్రతిపాద‌న‌ల్ని సిద్దం చేసింది. ఇవి క‌నుక అమోదం పొంది అధికారికమైతే.. దేశీయ‌.. అంత‌ర్జాతీయంగా విమాన ప్ర‌యాణాలు చేసే ప్ర‌యాణికుల క‌ష్టాలు చాలామేర‌కు ఒక కొలిక్కి వ‌చ్చే వీలుంది.

ప్ర‌స్తుతం దేశీయ విమానాల్లో సామాగ్రి మిస్ అయితే.. రూ.20 వేల వ‌ర‌కు ప‌రిహారం ఇస్తున్నారు. దాన్ని ల‌క్ష‌కు పెంచాల్సిందిగా ప్ర‌తిపాదిస్తున్నారు. అదే స‌మ‌యంలో దెబ్బ తిన్న సామాగ్రికి కిలోకు రూ.3వేలు చొప్పున న‌ష్ట‌ప‌రిహారం ఇస్తున్నారు. దీన్ని మ‌రింత పెంచేలా ప్ర‌తిపాదిస్తున్నారు. విమానం మిస్ అయినా.. పొర‌పాటున బోర్డింగ్ పాస్ ను రిజెక్ట్ చేసినా ప్ర‌యాణికుల‌కు రూ.3వేల నుంచి రూ.20వేల ప‌రిహారం చెల్లించాలంటూ విమాన‌యాన మంత్రిత్వ శాఖ‌లో రూల్స్ మార్చాల‌ని అధికారులు భావిస్తున్నారు. అదే జ‌రిగితే.. విమాన ప్రయాణికుల‌కు అంత‌కు మించిన స్వీట్ న్యూస్ మ‌రొక‌టి ఉండ‌దు.