Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య గంజాయి చిచ్చు

By:  Tupaki Desk   |   16 Sep 2017 5:30 PM GMT
ఆ ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య గంజాయి చిచ్చు
X
ఏపీలో మంత్రుల మ‌ధ్య గంజాయి వార్ జ‌రుగుతోంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. విశాఖ జిల్లా నుంచి కేబినెట్‌ లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు గంటా శ్రీనివాసరావు - చింతకాయల అయ్యన్నపాత్రుడు మధ్య మొదటి నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతుండ‌టాన్ని రాజ‌కీయ‌వ‌ర్గాలు బ‌హిరంగంగానే చ‌ర్చించుకుంటున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక - ఉన్నతాధికారుల బదిలీల వ్యవహారం నుంచి ప్రతి విషయంలోనూ ఎత్తులు పై ఎత్తులతో విశాఖ జిల్లా రాజకీయాలను వేడెక్కించడంలో ఎవరికి వారే సరిసాటి. ఇద్దరు మంత్రుల తీరుతో ముఖ్యమంత్రికి నిత్యం తలనొప్పులే అని తెలుగు త‌మ్ముళ్లు సైతం అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చెప్తుంటారు. అనేక సందర్భాల్లో ఇద్దరు మంత్రులను ముఖ్యమంత్రి పలు మార్లు హెచ్చరించారు. పార్టీలో గ్రూపు రాజకీయాలను సహించేది లేదని చెప్పినా మంత్రుల తీరులో ఎటువంటి మార్పు రాలేదని టీడీపీ నేత‌లు చెప్తుంటారు.

తాజాగా ఈ ఎపిసోడ్‌ లోకి గంజాయి వ‌చ్చిచేరింది. తాజాగా కొద్ది రోజుల క్రితం విశాఖలో భూ కుంభకోణం జరిగిందని సాక్షాత్తు మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించడంతో అది ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే. సిట్ దర్యాప్తు వరకూ వెళ్లింది. గంటాను టార్గెట్ చేసుకునే అయ్యన్న ఈ ఆరోపణలు చేసినట్లు వారి తీరు తెలిసినవారెవరికైనా ఇట్టే అర్ధమవుతుంది. భూ కుంభకోణం వివాదాలు చుట్టుముట్టినా మంత్రి గంటా శ్రీనివాస్ ఒక్క మాట కూడా మాట్లాకుండా సమయం కోసం వేచిచూశారు. ఇదే సమయంలో విశాఖ జిల్లాలో గంజాయి సాగు గురించి కేంద్రం సీరియస్‌గా స్పందించింది. సరిగ్గా ఈ వ్యవహారాన్ని మంత్రి గంటా అందిపుచ్చుకున్నారు. అవసరం లేకపోయినా గంజాయి సాగును అరికట్టాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసి గంజాయిని ఉక్కుపాదంతో అణచివేస్తామని.. దీని వెనక ఎంత పెద్ద తలలు ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. గంటా ఈ వ్యాఖ్యలు చేయడం వెనక అయ్యన్న పాత్రుడిని ఉద్దేశించే అన్నారని పార్టీలోనే జోరుగా చర్చ సాగుతోంది.

అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలో గంజాయి సాగు, సరఫరా యధేచ్చగా సాగుతోంది. దీంతో అందరి చూపు తనవైపునకు తిరగడంతో గంజాయి సాగుపై అయ్నన్న పాత్రుడు కూడా నర్మగర్బ వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులకు తెలిసే ఇదంతా జ‌రుగుతోంద‌ని అయ్య‌న్న వ్యాఖ్యానించారు. మంత్రుల మధ్య ఆధిపత్య పోరు సంగతి ఎలా ఉన్నా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ద్వారా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. విశాఖ జిల్లా భూ కుంభకోణం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత చర్చనీయాంసమైందో.. ఇప్పుడు మంత్రుల చ‌ర్య‌ల కార‌ణంగా గంజాయి వివాదం అదే స్ధాయిలో చర్చనీయాంశమవుతుండ‌టం గ‌మ‌నార్హం.