Begin typing your search above and press return to search.

మళ్లీ అదే తప్పు చేస్తున్న టీడీపీ నేతలు

By:  Tupaki Desk   |   29 May 2019 5:38 PM GMT
మళ్లీ అదే తప్పు చేస్తున్న టీడీపీ నేతలు
X
ఏపీలో టీడీపీ దారుణ ఓటమి చవిచూసినా ఆ పార్టీ నేతల తీరు మాత్రం మారడం లేదు. వైసీపీ పట్ల ఉన్న ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో ఈ ఎన్నికల ఫలితాలతో తేలిపోయినా కూడా ఇంకా టీడీపీ నేతలు మాత్రం ప్రజల్లో నెగటివ్ ప్రచారానికే ప్రయారిటీ ఇస్తున్నారు. జగన్ ఇంకా సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే టీడీపీ నేతలు వ్యతిరేక ప్రచారాలతో ఊదరగొడుతున్నారు. ముఖ్యంగా వైసీపీని అధికారంలోకి తెచ్చిన నవరత్నాలను టీడీపీ నాయకులు టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది.

వైఎస్ జగన్ మోహనరెడ్డి ఇంకా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే తెలుగుదేశం పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడంతో కనీసం ఆ ఎన్నికల్లోనైనా పట్టు చూపాలన్న ఉద్దేశంతో వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైసీపీ నవరత్నాల్లో మూడు ఆల్రెడీ మాయమైపోయాయని ఎద్దేవా చేశారు.

జగన్ మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో మూడు రత్నాలు ప్రమాణ స్వీకారానికి ముందే రాలిపోయాయని అయ్యన్న అన్నారు. పింఛన్లు మూడు వేల రూపాయలు చేస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు తర్వాత ఎప్పుడో చేస్తానని అంటున్నారన్నారు. అలాగే పోలవరం తమ బాధ్యత కాదు, కేంద్రం చూసుకుంటుందని అంటున్నారని అన్నారు. ప్రత్యేక హోదాను అడుగుతూనే ఉంటాం తప్ప.. ఏమీ చేయలేమంటూ వ్యాఖ్యానించారని ఎద్దేవా చేశారు.

పొరుగు రాష్ట్రం తెలంగాణలో అయిదు నెలల కిందట మంచి మెజారిటీతో గెలిచిన టీఆరెస్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపకపోవడంతో... ఇక్కడా వైసీపీని అదే రీతిలో దెబ్బతీయాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే వైసీపీపై ఎదురుదాడి చేస్తూ ఇప్పటి నుంచే స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే అయ్యన్నపాత్రుడు వంటి సీనియర్ నేతలు నేరుగా నవరత్నాలు వంటి కీలక హామీలను టార్గెట్ చేశారు. అయితే... గత రెండేళ్లుగా అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ వైసీపీ నవరత్నాలను - ఇతర ప్రపోజ్డ్ పథకాలను ఎంతగా తప్పు పట్టినా కూడా జనం మాత్రం టీడీపీని నమ్మలేదు. వైసీపీకే పట్టం కట్టారు. అయినా, టీడీపీ నేతలు మాత్రం మళ్లీ అదే తప్పు చేస్తున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.