Begin typing your search above and press return to search.

జగన్ విషయంలో తగ్గేదిలే... ?

By:  Tupaki Desk   |   7 Dec 2021 1:30 PM GMT
జగన్ విషయంలో తగ్గేదిలే... ?
X
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సీనియర్ మోస్ట్ నేత. ఆయన టీడీపీ కోసమే తాను ఉన్నాను అంటున్నారు. టీడీపీని మళ్ళీ గెలిపించాలన్నదే తన టార్గెట్ అని చెబుతున్నారు.

ఇటీవల ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని అనేక అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టారు. జగన్ని ఎదుర్కొనే విషయంలో ఎక్కడా తాను తగ్గేది లేదు అంటున్నారు. జగన్ పాలనలో అనుసరిస్తున్న వైఖరి మీద కూడా మండిపడ్డారు. వరదలు వచ్చిన ప్రాంతాలలో ముఖ్యమంత్రి పర్యటించకపోవడం ఏంటని ప్రశ్నించారు.

తాను సీనియర్ నేతగా ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, జగన్ లాంటి వారిని ఎక్కడా చూడలేదని చెబుతున్నారు. ఆయన ఏలుబడిలో ఏపీ సర్వనాశనం అయిందని, ఇక అన్ని వర్గాల ప్రజలకు భవిష్యత్తు లేదని తేలిపోయిందని అన్నారు. ఈ దశలో కూడా వైసీపీని సపోర్ట్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే మాత్రం వారు మూర్ఖులు కిందనే లెక్క అని ఆయన అంటున్నారు.

విశాఖలో ఉన్న ఒక రీసార్ట్ లో తన వాటాను వదులుకోవాలని బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కి కూడా వైసీపీ నేతలు దిగిపోయారని, తన కష్టార్జితంతో భోగాపురం దగ్గర దాన్ని అభివృద్ధి చేశామని ఆయన పేర్కొన్నారు. తాను ఆ రీసార్ట్ లో పదిహేను శాతం వాటాను కలిగి ఉన్నానని, ఇపుడు ఆ రీసార్ట్స్ లో మెయిన్ పార్టనర్లను అయ్యన్నను తప్పుకునేలా చేయమని బెదిరిస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు.

అదే విధంగా తన కుటుంబాన్ని కూడా విడదీశారని, తన తమ్ముడు సన్యాసిపాత్రుడుని కూడా తన నుంచి వేరు చేసి వీక్ చేయాలని చూశారని అయ్యన్న కామెంట్స్ చేశారు. అయితే నర్శీపట్నంలో ఈ రోజుకీ తన మీద జనాలకు నమ్మకం ఉండబట్టే మునిసిపాలిటీలో 12 వార్డులలో టీడీపీని గెలిపించారని ఆయన చెప్పుకున్నారు. ఇక విశాఖను రాజధానిగా చేయవద్దు అని ఎలుగెత్తి చాటిన మొదటి వ్యక్తిని తానేనని ఆయన చెప్పారు.

విశాఖను రాజధానిగా చేయడం వల్ల శాంతియుత వాతావరణం పాడవుతుందని, అంతే కాకుండా రాష్ట్రానికి అది బాగా మూలన ఉండడం వల్ల ఎవరికీ సదుపాయం కాదని చెప్పారు. విశాఖను ఆర్ధిక రాజధాని చేయలని ఆయన డిమాండ్ చేశారు. మరో వైపు విశఖలో టూరిజం పరంగా డెవలప్మెంట్ చేయకపోగా ఉన్న వాటిని కూడా కూలగొడుతోంది ప్రస్తుత ప్రభుత్వం అని ఆరోపించారు.

గంజాయి అక్రమ రవాణా సాగుతున్నా అసలైన వారిని వదిలేస్తున్నారని, దీని వల్లనే విశాఖకు చెడ్డ పేరు వస్తోందని అయ్యన్న అన్నారు. జగన్ విశాఖకు చేసిందేమీ లేదని, ఏ అభివృద్ధి అయినా టీడీపీ హయాంలోనే జరిగిందని తాను గట్టిగా చెప్పగలను అని ఆయన స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో తన పాత్ర ఉందని నిరూపించాలని అయ్యన్న సవాల్ చేశారు.

ఇదిలా ఉంటే సొంత పార్టీ నేతల మీద కూడా ఆయన కామెంట్స్ చేశారు. పార్టీ అధికారంలో ఉన్నపుడు అనుభవించిన వారు ఇపుడు సైలెంట్ కావడం మంచి పద్ధతి కాదని, అంతా కలసి టీడీపీని మళ్ళీ గెలిపించాల్సి ఉందని చెప్పారు. విశాఖ నుంచి భీమిలీ దాకా చాప చుట్టేసినట్లుగా స్థలాలను ఆక్రమించున్నారని అధికార పార్టీ మీద ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మొత్తానికి ఫైర్ బ్రాండ్ అయ్యన్న వైసీపీ విషయంలో తగ్గేది లేదని చెబుతూనే 2024 ఎన్నికల్లో టీడీపీకి అధికారం దక్కడం ఖాయమని పేర్కొనడం విశేషం.