Begin typing your search above and press return to search.

సొంత వాళ్లే మోసం చేశారట, కానీ గెలుస్తారట!

By:  Tupaki Desk   |   19 April 2019 2:30 PM GMT
సొంత వాళ్లే మోసం చేశారట, కానీ గెలుస్తారట!
X
ఏపీ ఎన్నికల పోలింగ్ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తున్న వాదనలు కాస్త చిత్రంగా ఉంటున్నాయి. ఒకవైపు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పోలింగ్ రోజున ఈవీఎంల విషయంలో అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే ఆరోపణతో మొదలు.. ఈసీ తీరుపై బాబు అనేక అనుమానాలు - ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.

అయితే అంత జరిగినా తామే గెలుస్తామని బాబు ప్రకటించుకుంటున్నారు. తమ పార్టీకి నూటా ముప్పై సీట్లు వస్తాయని ఒకసారి - కాదు నూటా యాభై అని మరోసారి చంద్రబాబు నాయుడు ప్రకటించుకున్నారు. అలా బాబు వాదనలో రెండు రకాలు ధ్వనిస్తున్నాయి.

ఇక ఆయనే కాదు.. చాలా మంది తెలుగుదేశం నేతలు కూడా ఈవీఎంల విషయంలో అక్రమాలు జరిగాయని అంటున్నారు. కానీ.. తమ పార్టీ గెలుస్తుందని అంటున్నారు. ఇందుకు తగ్గట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు..తెలుగుదేశం పార్టీ నర్సీపట్నం అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు చింతకాయల విజయ్.

పోలింగ్ రోజున తమ పార్టీలోనే వారే కొందరు కుట్ర చేశారని - వారంతా ప్రతిపక్ష పార్టీ వాళ్లతో టచ్ లోకి వెళ్లారని - వారు తమ వైరి పక్షం వారితో ఫోన్లో కూడా మాట్లాడారని..ఇంటెలిజెన్స్ ద్వారా ఆ విషయాలు అన్నీ తెలిశాయని విజయ్ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తాము అన్నీ గమనించినట్టుగా - అన్ని వివరాలనూ బాబుకు చేరవేసినట్టుగా తెలిపారు. సమయం వచ్చినప్పుడు వారిపై చర్యలుంటాయని అన్నారు. తమ విజయం కోసం కృషి చేసిన వారందరికీ సన్మానం చేయబోతున్నట్టుగా ప్రకటించారు.

మొత్తానికి 'కుట్ర జరిగింది..' అంటూనే తామే గెలుస్తామని ప్రకటించుకున్న తెలుగుదేశం నేతలు ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఈ మాటల భావ్యం ఏమిటనేది ఫలితాలు వస్తే కానీ తెలియదు!