Begin typing your search above and press return to search.

ఆర్టీసీ కాంప్లెక్స్ లో మ‌ల్టీఫ్లెక్సా..గొయ్యి తీసి పాతేస్తా!

By:  Tupaki Desk   |   24 Aug 2018 8:02 AM GMT
ఆర్టీసీ కాంప్లెక్స్ లో మ‌ల్టీఫ్లెక్సా..గొయ్యి తీసి పాతేస్తా!
X
ఎవ‌రేమ‌న్నా ఐడియాలు ఇస్తే చాలు.. అదే ప‌నిగా డాబు ప్ర‌చారం చేసేసి.. ఇష్టారాజ్యంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో రెండు రాష్ట్రాల్లో క‌నిపిస్తుంది. అందుకు భిన్నంగా ప్రాక్టిక‌ల్ గా ఆలోచించిన మంత్రిగా అయ్య‌న్న పాత్రుడ్ని చెప్పాలి. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

ప్ర‌భుత్వ భూముల విష‌యంలో ఆయ‌న ఎంత ప్రాక్టిక‌ల్ గా ఉన్నారో ఆయ‌న మాట‌ల్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. కోట్లాది రూపాయిలు విలువ చేసే భూముల్ని.. సింఫుల్ గా చిన్న చిన్న ఒప్పందాల పేరుతో ఎవ‌రో ఒక‌రికి అప్ప‌గిస్తున్న వైనాన్ని ఆయ‌న అడ్డుకున్న తీరు అభినందించేలా మారింది.

న‌ర్సీప‌ట్నం ఆర్టీసీ బ‌స్టాండ్ ప్రాంగ‌ణంలో ఉన్న స్థ‌లంలో మ‌ల్టీఫ్లెక్స్ క‌ట్టాల‌న్న ఆలోచ‌న‌తో పాటు.. అందుకు సంబంధించిన ప‌నులు షురూ చేయ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడిన ఆయ‌న్న‌.. ప‌నులు ఆప‌ని ప‌క్షంలో అక్క‌డున్న మిష‌న్ల‌ను త‌గ‌ల‌బెడ‌తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

త‌న మంత్రి ప‌ద‌వి తీసినా ప్ర‌జ‌ల‌కు న‌ష్టం వాటిల్లే ప‌నులు ఎట్టి ప‌రిస్థితుల్లో చేయ‌న‌ని ఆయ‌న స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం. ఆర్టీసీ ప్రాంగ‌ణంలో మ‌ల్టీఫ్లెక్స్ క‌ట్టేందుకు జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల గురించి తెలుసుకొని అక్క‌డ‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. "ఇప్పుడు మ‌నం ఉండొచ్చు.. రేపు లేక‌పోవ‌చ్చు.. ఆర్టీసీ కాంప్లెక్స్ ఉన్న స్థ‌లంలో నిర్మించే మ‌ల్టీఫ్లెక్స్ లో నాలుగు సినిమా హాళ్లు.. మూడు క‌ల్యాణ మండ‌పాలు.. షాపులు క‌ట్టొచ్చు.. స్థ‌లం లీజుతో ఆర్టీసీకి ఏడాదికి రూ.40 ల‌క్ష‌లు రావొచ్చు. ఆ మాత్రం ఆదాయానికే జ‌నాన్ని ఇబ్బందుల‌కు గురి చేయాలా? ప‌ట్ట‌ణంలో ఇప్పుడు స్థ‌లం ఎక‌రా ఐదు కోట్ల వ‌ర‌కూ ఉంది.. ఇదే స్థ‌లం ఆర్టీసీ కొన‌గ‌ల‌దా? అయినా.. నా మాట కాద‌ని మ‌ల్టీఫ్లెక్సుల నిర్మాణం చేస్తే స‌హించ‌ను. చూస్తూ ఊరుకోను"

"ప‌ద‌వి తీసేస్తే తీసేయ‌నివ్వండి.. వెన‌క్కి త‌గ్గేది లేదు. ప్ర‌జ‌ల ఇష్టానికి భిన్నంగా ఎలాంటి ప‌ని చేయ‌ను.. క‌ట్టొద్ద‌ని చెప్పిన త‌ర్వాత క‌డితే గొయ్యి తీసి పాతేస్తా.. మిష‌న్లు తీయ‌క‌పోతే త‌గ‌ల‌బెట్టేస్తా" అంటూ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ప్ర‌భుత్వ భూముల్ని డీల్స్ పేరుతో వేరొక‌రికి అప్ప‌గించ‌టంపై అయ్య‌న్న ఆగ్ర‌హాన్ని అర్థం చేసుకోవ‌చ్చ‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.