Begin typing your search above and press return to search.

వైసీపీ మంత్రులకు స్ట్రాంగ్ కౌంటర్...జగన్ రెడ్డీ అంటూ...

By:  Tupaki Desk   |   14 Sep 2022 12:30 PM GMT
వైసీపీ మంత్రులకు స్ట్రాంగ్ కౌంటర్...జగన్ రెడ్డీ అంటూ...
X
అవును ఆయనకు పూనకమే వచ్చింది. మీడియా ముందు మైకు పట్టుకుని ఊగిపోయారు. వైసీపీ అధినాయకుడు, ముఖ్యమంత్రి జగన్ తో మొదలెట్టి మంత్రుల దాకా అందరికీ కౌంటర్లు గట్టిగానే వేసేశారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అంటే ఫైర్ బ్రాండ్ కి మారు పేరు. ఆయన వైసీపీ వారి మూడు రాజధానుల మీద ఒక విధంగా మండిపోయారు. జగన్ రెడ్డీ మాట తప్పడం మడమ తిప్పడం అంటే ఇదే కదా అని సెటైర్లు వేశారు. విపక్ష నేతగా ముందొక మాట తరువాత మరోటి చెప్పి ఇలాగేనా జనాలను మభ్యపెట్టేది జగన్ రెడ్డీ అని నిలదీశారు.

చరిత్రలో నీకంటే కూడా ఎందోరో మహామహులు వచ్చారు. కొట్టుకునిపోయారు. ఈ రోజు అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా చేస్తే కుదరదు జగన్ రెడ్డీ అని అయ్యన్న చెప్పుకొచ్చారు. నాడు అమరావతి మన రాజధాని అని మీరు చెప్పలేదా. ఈ రోజు మంత్రులుగా ఉన్న రోజా లాంటి వారు ఏం చెప్పారో వీడియలు ఉన్నాయి. నాడు బొత్స సత్యనారాయణ సహా అందరూ అమరావతే మన రాజధాని అని చెప్పిన విషయాలు అన్నీ వీడియోల రూపంలో చరిత్రలో పదిలంగా ఉన్నాయని అయ్యన్న గుర్తు చేశారు.

తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ప్లేట్ ఫిరాయించి మూడు రాజధానులు అనడమేంటి జగన్ రెడ్డీ అని అయ్యన్న విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాలే ఏపీలో సక్రమంగా చేయలేని మీ ప్రభుత్వం మూడు రాజధానులు ఎలా కడుతుందని ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధిని సర్వనాశనం చేయడమే మీ విధానమా అని నిప్పులు చెరిగారు. ఈ రోజున పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ఏపీకి రావడంలేదు. అన్ని రకాలుగా రాష్ట్రం నష్టపోయింది అంటే వైసీపీ ఏలుబడి వల్లనే అని ఆయన ఫైర్ అయ్యారు.

చంద్రబాబు ఎంతో దూరాలోచనతో బ్రహ్మాండమైన రాజధాని అమరావతిలో నిర్మిస్తూంటే దాన్ని కాకుండా చేసి రైతులను రోడ్డున పడేసింది వైసీపీ ప్రభుత్వ పెద్దలు అని అయ్యన్న ఆరోపించారు. స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం తెలుగుదేశంలో ఎన్నో పదవులు చేపట్టి ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ధర్మాన ప్రసాదరావు కోర్టు తీర్పులను కూడా పక్కన పెట్టి ఉత్తరాంధ్రాకు రాజధాని కావాలని ఎలా అడుగుతున్నారని అయ్యన్న‌ నిలదీశారు.

ఒక మంత్రి అయితే మూడు రాజధానుల కోసం మళ్ళీ చట్టం చేస్తామని మాట్లాడుతున్నారని, అదేలా కుదురుతుందో అతనికి ఏమైనా తెలుసా అని అయ్యన్న ప్రశ్నించారు. కోర్టు పక్కాగా తీర్పు ఇచ్చాక కూడా ఈ వితండవాదన ఏంటి అని ఆయన్న నిగ్గదీశారు. ఒక మంత్రి అమరావతిని ఎడారి అంటారు, మరో మంత్రి శ్మశానం అంటారు, నాడు మీరు మద్దతు ఇచ్చిన అమరావతి ఇపుడు అలా ఎందుకు కనిపిస్తోందని అయ్యన్న గట్టిగా అడిగి కడిగేశారు.

ప్రజలను తప్పుతోవ పట్టించాలని చూస్తే మీకే నష్టం. చట్టాలను కోర్టు తీర్పులను గౌరవించుకోవాల్సిందే. మాట తప్పకుండా మడప తిప్పకుండా అమరావతి రాజధాని నిర్మాణానికి సహకరించాల్సిందే అని ఆయన వైసీపీకి అల్టిమేటం జారీ చేశారు. మొత్తానికి అయ్యన్న మాట తీరు జోరు చూస్తే ఉత్తరాంధ్రా మొత్తం అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతు ఇస్తోందనే అంటున్నారు. విశాఖ రాజధాని వద్దు అమరావతే ముద్దు అంటూ అయ్యన్న ముందుకు వచ్చి మాట్లాడడం ద్వారా టీడీపీకి కొండంత బూస్టింగ్ ఇస్తూనే వైసీపీని నిప్పులతో చెరిగేశారు. దీంతో తమ్ముళ్ళు ఫుల్ హుషార్ అవుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.