Begin typing your search above and press return to search.

జస్ట్ లక్షల్లో ఒకడంతే : గంటా మీద డబుల్ డోస్ పడిందలా...!

By:  Tupaki Desk   |   19 Jan 2023 1:10 PM GMT
జస్ట్ లక్షల్లో ఒకడంతే : గంటా మీద డబుల్ డోస్ పడిందలా...!
X
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాను సైకిల్ దిగను, తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను అని చెప్పి ఇరవై నాలుగు గంటలు కాలేదు సొంత పార్టీలోనే ప్రత్యర్ధిగా ఉన్న మరో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు బిగ్ సౌండ్ చేశారు. చాన్నాళ్ల తరువాత తన ప్రియ మిత్రుడికి డబుల్ డోస్ ఇచ్చేశారు. ఎవడండీ ఈ గంటా అంటూ అయ్యన చేసిన సౌండ్ కి సొంత పార్టీలోని తమ్ముళ్ళే నివ్వెరపోయి చూడాల్సి వచ్చిందేమో.

ఆయన ఏమైనా ప్రధానా లేక పెద్ద నాయకుడా. తెలుగుదేశం పార్టీలోని లక్షలమందిలో ఒకడు అంటూ చెడుగుడు ఆడేశారు అయ్యన్న. పార్టీ కష్టకాలంలో ఉంటే బొక్కలలో దాక్కున్న వారు ఎన్నికలు అనడంతోనే బయటకు వస్తున్నారు అని గంటానే టార్గెట్ చేస్తూ దెప్పిపొడిచారు. పార్టీ కోసం గత నాలుగేళ్లుగా పాటుపడిన వారు ఎంతో మంది ఉన్నారని, వారు ప్రాణాలకు తెగించి పోరాడారని అయ్యన్న గుర్తు చేశారు.

అప్పట్లో పార్టీకి అండగా ఉండని వారే ఇపుడు బయటకు మళ్ళీ వస్తున్నారు అని విసుర్లు విసిరారు. గంటా సహా ఎవరు పార్టీకి వచ్చి ఈ టైం లో పనిచేసినా మంచిదే అని అంటూనే మరో వైపు తీవ్రమైన విమర్శలు చేశారు అయ్యన్న. పార్టీని పట్టించుకోని వారిని చూస్తే తమకు బాధ వేస్తుందని ఆయన అన్నారు.

తమకు సొంత పార్టీలో ఎవరి మీద వ్యతిరేకత లేదని, పార్టీకి దూరంగా ఉన్న వారు కూడా బాగానే ఉండాలని కోరుకుంటామని అయ్యన్న సెటైర్లు వేశారు. అందరూ పార్టీకి కావాలని, అందరూ వచ్చి పనిచేయాలని ఆయన హితబోధ చేశారు. మరో వైపు చూస్తే తెలుగుదేశం బీసీల పార్టీని అని ఆయన గట్టిగా క్లెయిం చేశారు.

అంటే తెలుగుదేశం ఇపుడు కాపు నేతలకు ప్రయారిటీ ఇస్తోంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీటిని చూడాలని అంటున్నారు. బీసీలు తెలుగుదేశాన్ని ఎపుడూ మోసం చేయలేదని అయ్యన్న అనడం వెనక కూడా చాలా అర్ధాలు ఉన్నాయని అంటున్నారు. పార్టీ ఓడినపుడు, కష్టకాలంలో తెలుగుదేశానికి బీసీలే అండగా నిలబడ్డారని ఆయన అధినాయకత్వానికి గుర్తు చేయడం వెనక కూడా వ్యూహం ఉందని అంటున్నారు.

రేపటి రోజున గంటా కాపు కార్డుతో ప్రయారిటీ పొందకుండా అయ్యన్న తన బీసీ కార్డుని తీసి దాన్ని పార్టీకి అటాచ్ చేశారు అని అంటున్నారు. ఇక తొందరలోనే ఏపీలోని మూడు కీలకమైన ప్రాంతాలలో బీసీల సదస్సులు పెడతామని ఆయన చెప్పారు. ఇక హోం మంత్రి పదవి కూడా తాను కోరి మరీ చంద్రబాబు నుంచి తీసుకుంటాను అని అయ్యన్న చెప్పడం వెనక కూడా బడా ప్లాన్స్ ఉన్నాయనే అంటున్నారు.

మొత్తానికి గంటా మీద అయ్యన్న తనదైన శైలిలో సెటైర్లు పేల్చారనే అంటున్నారు. అయ్యన్నపాత్రుడు అంటే చంద్రబాబుకు లోకేష్ కి బాగా ఇష్టం. ఆయన వారికి సన్నిహితం కూడా. అయ్యన్న పొలిటికల్ హిస్టరీలో వేరే పార్టీలోకి మారింది లేదు. దాంతో పాటు ఆయన పార్టీ పుట్టుక నుంచి ఉన్న నాయకుడు. ఉత్తరాంధ్రాలో బలమైన బీసీ నేత. దాంతో ఆయన మాటలకు తెలుగుదేశం అధినాయకత్వం వద్ద ఎపుడూ విలువ ఉంటుందనే అంటున్నారు.

ఇక గంటాను విమర్శిస్తూనే ఎవరైనా పార్టీకి పనిచేయాలని అయ్యన్న అనడం ద్వారా ఆయన్ని ఒక సాధారణ నాయకుడిగానే చూడాలన్న సంకేతాన్ని అటు పార్టీ పెద్దలకు ఇచ్చారని అంటున్నారు. మొత్తానికి ఇద్దరు మాజీ మంత్రుల మధ్య మరో కోల్డ్ వార్ మొదలైంది. అది విశాఖ జిల్లాలో పార్టీ విజయావకాశాలను ఎంతవరకూ ప్రభావితం చేస్తుందో చూడాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.