Begin typing your search above and press return to search.

మజ్లిస్ విస్తరణ వ్యూహం

By:  Tupaki Desk   |   3 Jan 2016 11:12 AM GMT
మజ్లిస్ విస్తరణ వ్యూహం
X
కొన్ని దశాబ్దాలుగా కేవలం పాతబస్తీకే పరిమితమైన మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఇప్పుడు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించాలని నిర్ణయించింది. హైదరాబాద్ లో కూడా పాతబస్తీకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ కాలు మోపాలని, హిందువుల్లోనూ మంచి పేరు సంపాదించుకోవాలని పావులు కదుపుతోంది.

మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి శనివారం కొంతమంది అయ్యప్ప స్వాములు సన్మానం చేశారట. అందుకే ఆయన ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ సన్మానం చేయించుకున్నారట. వారితో శాలువా కప్పించుకున్నారట. ఈ విడ్డూరాన్ని గతంలో ఎప్పుడైనా విన్నారా? ఇది లౌకిక స్వభావమని, అన్ని మతాలను ఆదరించడంలో భాగంగానే మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ ఇలా సన్మానం చేయించుకున్నారని అనుకుంటే తప్పులో కాలేసినట్లే.

గ్రేటర్ పరిధిలో 40 నుంచి 45 వరకూ సీట్లు గెలుచుకోవడం మజ్లిస్ కు వెన్నతో పెట్టిన విద్య. ముస్లిముల ప్రాబల్య ప్రాంతాల్లో పూర్తి ఓట్లు ఆ పార్టీ నేతలకే పడతాయి. కొన్ని దశాబ్దాలుగా ఇదే పరిస్థితి దాంతో ఒప్పందంలో భాగంగా తప్పితే సొంతంగా మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం రావడం లేదు.

ముస్లిముల ఓటు బ్యాంకుకే పరిమితం అయితే ఎప్పటికైనా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, సొంతంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం సాధ్యం కాదని మజ్లిస్ నేతలు భావిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ముస్లిమేతర ప్రాంతాల్లో కూడా పాగా వేయాలని నిర్ణయించారు. ఇందుకు హిందువుల ఆదరణ అవసరం కదా. అందుకే రాజకీయఎత్తులు పైయెత్తులకు తెరతీశారు. అయ్యప్ప స్వాములతో సన్మానాలు కూడా చేయించుకుంటున్నారు. తెర వెనుక కుల సంఘాలతో మాట్లాడుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.