Begin typing your search above and press return to search.

హీటెక్క‌నున్న ఢిల్లీ.. ఒకే రోజు ఒకే చోట జ‌గ‌న్, చంద్ర‌బాబు!

By:  Tupaki Desk   |   2 Aug 2022 11:34 AM GMT
హీటెక్క‌నున్న ఢిల్లీ.. ఒకే రోజు ఒకే చోట జ‌గ‌న్, చంద్ర‌బాబు!
X
ఆగ‌స్టు 6న దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో అరుదైన సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. నిత్యం విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో ఏపీ రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తొలిసారిగా ఒకే స‌మావేశంలో పాల్గొన‌డానికి తెర లేస్తోంది. దీనికి దేశ రాజధాని దిల్లీ వేదిక కాబోతోంది. అటు జ‌గ‌న్, ఇటు చంద్ర‌బాబు ఇద్ద‌రూ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉండ‌టంతో అంతా ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు.

దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాలను పురస్కరించుకుని ఆగ‌స్టు 6వ తేదీ జరుగునున్న ఉత్సవాల జాతీయ కమిటీ సమావేశానికి హాజరు కావల్సిందిగా వైఎస్ జ‌గ‌న్, చంద్ర‌బాబుల‌కు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో నిర్వహించే సమావేశానికి తొలిసారి వీరిద్దరూ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని దాదాపుగా అన్ని పార్టీల అధినేతలను కూడా కేంద్రం ఆహ్వానించింది. దానిలో భాగంగానే ఏపీకి చెందిన వీరిద్దరికీ కూడా ఆహ్వానాలు అందాయ‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీ అధినేత‌లిద్ద‌రూ ఢిల్లీకి వెళ్లాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ ఈ సమావేశానికి హాజరు కావడ‌మే కాకుండా అనంతరం ప్రధాని మోదీతో ప్ర‌త్యేకంగా భేటీ అవుతార‌ని స‌మాచారం. అలాగే రాష్ట్రానికి సంబంధించి వివిధ పెండింగ్ సమస్యల పరిష్కారానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతోనూ భేటీ కానున్నట్లు తెలిసింది. అలాగే అదేరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ నేప‌థ్యంలో ఎన్‌డీఏ అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కూడా జగన్‌ కలిసే అవకాశం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక సుదీర్ఘ విరామం తరువాత కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన ఈ ఆహ్వానానికి చంద్రబాబు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్ణయించారు. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌ బీజేపీతో తెగదెంపులైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన తొలిసారిగా జరిగే ఈ సమావేశానికి హాజరుకావడం చంద్రబాబు ఒక అవకాశంగా భావిస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన‌ప్ప‌టి నుంచి బీజేపీకి పార్ల‌మెంటులో వివిధ సంద‌ర్భాల్లో టీడీపీ కూడా మ‌ద్ద‌తిస్తూ వ‌చ్చింది. కేంద్రంతో వైసీపీ ప్రభుత్వం అంటకాగుతూ టీడీపీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంద‌నే అభిప్రాయం చంద్ర‌బాబులో ఉంద‌ని అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్ర‌బాబు బీజేపీతో మళ్లీ దగ్గర‌వ్వ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో తొలిసారి ముఖ్య‌మంత్రి, ప్ర‌తిప‌క్ష నేత తొలిసారిగా క‌లిసి పాల్గొన్న‌బోతున్న స‌మావేశం కాబ‌ట్టి ఏం జ‌రుగుతుందో తెలుసుకోవ‌డానికి అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.