Begin typing your search above and press return to search.

బాబుకు షేక్ హ్యాండ్ ఇస్తేనే జగన్ బ్యాచ్ అంతలా షేక్ అవ్వాలా?

By:  Tupaki Desk   |   9 Aug 2022 5:14 AM GMT
బాబుకు షేక్ హ్యాండ్ ఇస్తేనే జగన్ బ్యాచ్ అంతలా షేక్ అవ్వాలా?
X
ఒక చిన్న పరిణామానికి ఏపీ అధికారపక్షం ఆగమాగం అయిన తీరు ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో తెలుగు తమ్ముళ్లలో కొత్త ఆలోచనలకు తెర తీసింది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూసినోళ్లు.. ‘ఔరా’ అని ఆశ్చర్యపోతున్నారు. తాము ఎవరికి భయపడమని.. ఎవరితోనైనా ఇట్టే తలపడతామన్న మాటల్లో డొల్లతనమే తప్పించి.. అసలు విషయం చాలా తక్కువన్న విషయం తాజా పరిణామాలతో అర్థమవుతుందన్న విషయం ఏపీ ప్రజలకు అర్థమవుతున్న పరిస్థితి.

మూడు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లటం.. కేంద్రం నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ప్రతిపక్ష నేతలు.. పలువురు ప్రముఖులను ఈ ప్రోగ్రాంకు ఆహ్వానించటం తెలిసిందే.

కేంద్రం ఆహ్వానంతో చంద్రబాబు హజరు కాగా.. సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబును ప్రధాని మోడీ పక్కకు తీసుకెళ్లటం.. కాసేపు మాట్లాడటం అందరిని ఆశ్చర్యంతో పాటు ఆసక్తిని రేకెత్తించింది. ఎందుకంటే.. ఈ సమావేశానికి ముందు టీడీపీకి బీజేపీకి మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన ఘాటు విమర్శల గురించి తెలిసిందే. అప్పటి నుంచి వారిద్దరి మధ్య దూరం పెరగటం.. తాను చేసిన తప్పును చంద్రబాబు గ్రహించినప్పటికీ.. బీజేపీఆయన్ను దూరం పెట్టింది.

ఈ పరిస్థితికి భిన్నంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ సమావేశం అనంతరం బాబును పక్కకు తీసుకెళ్లి.. మీతో చాలా విషయాలు మాట్లాడాలని.. ఢిల్లీకి ఎప్పుడైనా రావొచ్చని చెప్పటం.. అందుకు చంద్రబాబు సైతం సానుకూలంగా స్పందించటం తెలిసిందే. అయితే.. దీనికి సంబంధించిన వార్త చాలా చిన్నదిగానే పబ్లిష్ అయ్యింది. అయితే.. ఈ పరిణామంపై ఏపీ అధికారపక్షం ఆగమాగం అయిపోయినట్లుగారియాక్టు కావటం సంచలనంగా మారింది.

చంద్రబాబుకు ప్రధాని మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఆయన్ను పక్కకు తీసుకెళ్లి మాట్లాడిన ఐదు నిమిషాల అంశంపై ఏపీ అధికార పక్షం అవసరానికి మించి రియాక్టు కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేవలం కుశల ప్రశ్నలు వేసి.. మరోసారి కలుద్దాం.. మాట్లాడుకోవటానికి చాలానే ఉన్నాయి అన్న మాటలకు వైసీపీలో అంత కంగారు ఎందుకు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికే ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించే సజ్జల సైతం ప్రెస్ మీట్ పెట్టి.. చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసిన వైనం ఆసక్తికరంగా మారింది.

బీజేపీకి దగ్గర కావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి సహకరించి గెలిపించటానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఓపక్క ఆరోపణలు సంధిస్తూనే.. మరోపక్క మోడీ.. చంద్రబాబు మధ్య కేవలం కుశల ప్రశ్నలు జరిగి ఉండొచ్చని చెబుతూ.. ఈ హైప్ మొత్తం పచ్చ మీడియా మీదకు మళ్లించేలా మాట్లాడటం కనిపిస్తోంది.

మొత్తంగా చిన్నపాటి భేటీకే అంత పెద్ద అధికారపక్షం ఇంత ఆగమాగం కావాల్సిన అవసరం ఉందంటారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మొత్తంగా బీజేపీ.. జనసేన.. టీడీపీలు కలిసి పోటీ చేస్తే మొదటికే మోసం వస్తుందన్న భయమే వారిని ఇంతలా రియాక్టు అయ్యేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది.