Begin typing your search above and press return to search.

ఆ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌కు పొగ పెట్టేస్తోన్న అజారుద్దీన్‌...!

By:  Tupaki Desk   |   7 April 2022 6:39 AM GMT
ఆ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌కు పొగ పెట్టేస్తోన్న అజారుద్దీన్‌...!
X
తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న వ‌ర్గ విభేదాలు స‌మ‌సిపోవ‌డం లేదా..? సీనియ‌ర్ నేత‌ల మ‌ధ్య గొడ‌వలు ముదురుతున్నాయా..? పార్టీ పెద్ద‌లు ఆదేశించినా నాయ‌కుల మ‌ధ్య ఐక్య‌త ఎండ‌మావేనా..? అంటే అవున‌నే అంటున్నాయి పార్టీ శ్రేణులు. ఇందుకు త‌గ్గ‌ట్టే తాజా సంఘ‌టన ఒక‌టి పార్టీ నేత‌ల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్ వ్య‌వ‌హార శైలే దీనికి కార‌ణ‌మ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఒక‌ప్పుడు ఇండియా క్రికెట్ కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించి.. త‌న ఆట తీరుతో ఎంద‌రి మ‌న‌సుల‌నో చూర‌గొన్నారు అజారుద్దీన్‌. ప‌దిహేను సంవ‌త్స‌రాల పాటు దేశానికి సేవ‌లందించారు. కాలం క‌లిసిరాక మ్యాచ్ ఫిక్సింగ్ కార‌ణంతో ఆట‌కు దూర‌మ‌య్యారు. త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌తో కాంగ్రెస్ లో చేరి ఉత్త‌ర ప్ర‌దేశ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. త‌ర్వాత తెలంగాణ కాంగ్రెస్ శాఖ‌లో క్రియాశీల‌క పాత్ర పోషిస్తున్నారు.

రాహుల్ గాంధీతో త‌న‌కున్న సాన్నిహిత్యంతో తెలంగాణ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా నియ‌మితుల‌య్యారు. ఇపుడు తాజాగా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం కామారెడ్డి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన అజారుద్దీన్ అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి పోటీచేస్తాన‌ని వెల్ల‌డించారు. దీంతో పార్టీ శ్రేణులు అవాక్క‌య్యాయట‌. ముఖ్యంగా ష‌బ్బీర్ అలీ వ‌ర్గీయులు కంగుతిన్నార‌ట‌.

పార్టీ సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీ కామారెడ్డి నుంచి ప‌లుమార్లు గెలిచి మంత్రి ప‌ద‌వులు చేప‌ట్టారు. ఎన్ఎస్‌యూఐ కార్య‌క‌ర్త‌గా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ష‌బ్బీర్ అలీ అప్ప‌టి నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీనే అంటిపెట్టుకున్నారు. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాకే చెందిన డీఎస్ వంటి మ‌హామ‌హులు పార్టీలు మారినా తాను మాత్రం కాంగ్రెస్ జెండాను దించ‌లేదు. ఇలా పార్టీకి విధేయుడిగా ఉంటూ మ‌రోసారి అసెంబ్లీ నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న త‌రుణంలో అజారుద్దీన్ ప్ర‌క‌ట‌న షాక్ ఇచ్చింది.

వాస్త‌వానికి ముస్లిం కోటాలో త‌న‌కు రావాల్సిన వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌విని అజారుద్దీన్ ఎగ‌రేసుకుపోయారు. ఇపుడు అసెంబ్లీ స్థానానికి కూడా పొగ పెడుతుండ‌డంతో ఆయ‌న అనుచ‌రులు ఆందోళ‌న చెందుతున్నారు.

అయితే ష‌బ్బీర్ మాత్రం ధీమాతోనే ఉన్నార‌ట‌. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ అండ ఆయ‌న‌కు పుష్క‌లంగా ఉంద‌ని.. రేవంత్ సూచ‌న‌తోనే త‌న‌ను పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ చైర్మ‌న్ గా నియ‌మించార‌ని.. టికెట్ కూడా త‌న‌కే వ‌స్తుంద‌నే ధీమాతో ఉన్నార‌ట‌. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..?