Begin typing your search above and press return to search.

అజ్జూను ఆట ఆడుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   19 March 2019 10:46 AM GMT
అజ్జూను ఆట ఆడుకుంటున్నారా?
X
కొన్నిసార్లు అంతే.. దెబ్బ మీద దెబ్బ త‌గులుతుంటుంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెట్ కెప్టెన్ అజ‌రుద్దీన్ పొలిటిక‌ల్ కెరీర్ చూస్తే ఇదే తీరు క‌నిపిస్తోంది.కాంగ్రెస్ లో కొన‌సాగుతున్న ఆయ‌న గ‌త ఏడాది కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి గులాబీ కారు ఎక్కేందుకు డిసైడ్ అయిపోయారు. దీనికి సంబంధించిన సంప్ర‌దింపుల ప‌ర్వం కూడా పూర్తి అయ్యింది. ఇక‌.. పార్టీ మార‌ట‌మే మిగిలి ఉన్న వేళ‌.. తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ప‌లువురు.. కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఆయ‌న్ను బుజ్జ‌గించ‌ట‌మే కాదు.. భ‌విష్య‌త్తుకు సంబంధించిన సినిమాను చూపించిన‌ట్లు చెబుతారు.

రానున్న రోజుల్లోకాబోయే పీసీసీ ప్రెసిడెంట్ ప‌ద‌విని చూపించ‌టంతో ఆయ‌న టీఆర్ఎస్ లోకి వెళ్లే ప్ర‌య‌త్నాన్ని వాయిదా వేసుకొని కాంగ్రెస్ లో కొన‌సాగిన‌ట్లుగా చెబుతారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి.. తాజాగా జ‌రుగుతున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ స్థానానికి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేయ‌టానికి అజ్జూ ఆస‌క్తిని చూపించారు. అయితే.. ఆయ‌న అనుకున్న‌ది ఒక‌టైతే.. అధిష్టానం మ‌రొక‌టి త‌ల‌చింది. మాజీ ఎంపీ అంజ‌న్ కుమార్ యాద‌వ్ ను సికింద్రాబాద్ ఎంపీ అభ్య‌ర్థిగా ఎంపిక చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

దీంతో.. అజరుద్దీన్ తీవ్ర నిరాశ‌కు గురైన‌ట్లు చెబుతున్నారు. సికింద్రాబాద్ స్థానం కాకుండా హైద‌రాబాద్ స్థానం నుంచి బ‌రిలోకి దింపాల‌న్న ఆలోచ‌న‌లో పార్టీ ఉన్న‌ట్లుగా స‌మాచారం ఇచ్చారు. అయితే.. మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీపై పోటీకి అజార్ ఇష్ట‌ప‌డ‌లేద‌ని చెబుతారు. అయితే.. పార్టీ ఒత్తిడికి ఓకే చేసిన‌ట్లు చెబుతున్నారు. అయితే.. ఆ టికెట్ విష‌యంలోనూ అజ్జూకు టికెట్ ఇవ్వ‌ని కాంగ్రెస్ అధిష్ఠానం.. మైనార్టీ సెల్ నేత ఫిరోజ్ ఖాన్ కు టికెట్ ఇవ్వ‌టం చూస్తే.. అజార్ కు వ‌రుస షాకులు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. పార్టీ నుంచి త‌న‌కు వ‌రుస‌గా ఎదుర‌వుతున్న ఎదురుదెబ్బ‌ల‌పై అసంతృప్తితో ఉన్న అజ‌రుద్దీన్‌.. పార్టీలోనే కొన‌సాగుతారా? గులాబీ కారులో ఎక్కే ప్ర‌య‌త్నాల్ని మ‌ళ్లీ షురూ చేస్తారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.