Begin typing your search above and press return to search.

అజహర్ కు దిమ్మదిరిగిందిగా..

By:  Tupaki Desk   |   12 May 2016 7:38 AM GMT
అజహర్ కు దిమ్మదిరిగిందిగా..
X
జనాల మతిమరుపు తనం మీద సెలబ్రెటీలకు చాలా నమ్మకం. అందుకే చేసిన గతాన్ని కప్పెట్టేసి.. అసలేమీ జరగనట్లుగా మామూలుగా జనాల్లో తిరిగేస్తుంటారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ కూడా ఇలాగే చలామణి అయిపోయారు. ఒకప్పుడు భారత క్రికెట్లోనే అత్యంత గొప్ప కెప్టెన్లలో ఒకడిగా దేశమంతా అతణ్ని కీర్తించింది. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న పేరంతా పోగొట్టుకుని జనాల ముందు దోషిగా నిలబడ్డాడు అజహర్. ఫిక్సింగ్ నేరాలకు శిక్షలు విధించే చట్టాలు లేకపోవడం వల్ల కోర్టులో అతను నిర్దోషిగా బయటపడ్డప్పటికీ.. అతడి మీద నిషేధం తొలగిపోయినప్పటికీ.. జనాల దృష్టిలో మాత్రం అజహర్ మీద సందేహాలు తొలగిపోలేదు. అజహర్ సైతం మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతానికి సంబంధించి ఎప్పుడు ఎక్కడ చర్చ వచ్చినా మాట్లాడ్డానికి ఇష్టపడడు. తాను తప్పు చేయనపుడు దాని గురించి మాట్లాడ్డానికి అజహర్ కు వచ్చిన ఇబ్బందేంటో అర్థం కాదు.

తాజాగా తన జీవిత కథతో తెరకెక్కిన ‘అజహర్’ సినిమాతో అతను ముందు నుంచి అసోసియేట్ అయ్యి కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో సైతం అజహర్ చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. ఈ శుక్రవారం ‘అజహర్’ సినిమా రిలీజ్ కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్లో ఇంటర్వ్యూకు కూడా వెళ్లాడు అజహర్.

ఐతే అక్కడ సినిమాకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే టకీటకీమని సమాధానాలు చెప్పిన అజహర్.. ఉన్నట్లుండి మ్యాచ్ ఫిక్సింగ్ మీదకి ప్రశ్నలు మళ్లించేసరికి ముఖం మాడ్చేశాడు. మీ మీద వచ్చిన ఆరోపణల సంగతేంటి.. మీరు ఫిక్సింగ్ కోసం డబ్బులు తీసుకున్నారా అని ప్రశ్నించగానే ఉడుక్కుని కోపంగా వేదిక దిగి వచ్చేశాడు. తర్వాత అతణ్ని వేదిక మీదికి పిలిచినా రాలేదు. ఈ అనుభవంతో ముందుగా కమిట్మెంట్ ఇచ్చిన మరో ఛానెల్ ఇంటర్వ్యూను కూడా తిరస్కరించాడట అజహర్. ఇలా ప్రవర్తించడం ద్వారా తన మీద ఉన్న సందేహాలకు మరింతగా బలం చేకూర్చాడు అజహర్. కాదంటారా..?