Begin typing your search above and press return to search.

దానం చేయడంలో కర్ణుడిని మించిన అజీమ్‌ ప్రేమ్‌ జీ!

By:  Tupaki Desk   |   11 Nov 2020 3:30 PM GMT
దానం చేయడంలో కర్ణుడిని మించిన అజీమ్‌ ప్రేమ్‌ జీ!
X
దేశీయ ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపక చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌ జీ.. భారత దానకర్ణుల్లో మొదటిస్థానంలో నిలిచారు. 2019-20 ఆర్థిక సంవత్సరం ప్రేమ్‌జీ రూ.7,904 కోట్లు సామాజిక కార్యక్రమాల కోసం విరాళం ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే .. రోజుకు సరాసరి రూ.22 కోట్లు దానం చేశారని ఎడెల్‌ గివ్‌ హురున్‌ ఇండియా ఫిలాంథ్ర పీ లిస్ట్‌ 2020 వెల్లడించింది. గత ఏడాది జాబితాలో అగ్ర స్థానాన నిలిచిన హెచ్‌ సీఎల్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకులు శివ్ ‌నాడార్ తాజాగా రెండో స్థానానికి పరిమితం అయ్యారు.

2018-19లో రూ.826 కోట్లుగా నమోదైన నాడార్‌ విరాళం ఈ సారి రూ.795 కోట్లు. 2018-19లో ప్రేమ్‌ జీ రూ.426 కోట్ల విరాళంతో రెండో స్థానంలో ఉన్నారు. భారత్‌ లో అత్యంత సంపన్నుడు - రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ రూ.458 కోట్ల విరాళాలతో ఈ సారీ మూడో స్థానంలో కొనసాగారు. ఎడెల్‌ గివ్‌ హురున్‌ సంయుక్తంగా ఈ జాబితా విడుదల చేయడం వరుసగా ఇది ఏడోసారి. ఈ సారి మొత్తం 112 మందికి స్థానం లభించింది. గత ఏడాదితో పోలిస్తే సంఖ్య 12 శాతం పెరిగింది. జాబితాలోని వ్యక్తులిచ్చిన మొత్తం విరాళాలు 175 శాతం పెరిగి రూ.12,050 కోట్లకు చేరుకున్నాయి. రూ.10 కోట్లకు పైగా దానం చేసిన వారి సంఖ్య 72 నుంచి 78కి పెరిగింది. లిస్ట్‌ లోని 109 మంది రూ.5 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చారు.

మొత్తం ఏడుగురు మహిళలకు చోటు లభించింది. రోహిణి నీలేకని రూ.47 కోట్ల విరాళంతో మహిళల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అను ఆగా కుటుంబం రూ.36 కోట్లు - బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా రూ.34 కోట్లు దానం చేశారు. ఏటీఈ చంద్ర ఫౌండేషన్‌ కు చెందిన అమిత్‌ చంద్ర - అర్చన చంద్ర రూ.27 కోట్ల విరాళమిచ్చారు. ఫ్లిప్‌ కార్ట్‌ సహ వ్యవస్థాపకులు బిన్నీ బన్సల్‌ రూ.5.3 కోట్లు దానం చేశారు. 37 ఏళ్ల బన్సల్‌.. ఈ జాబితాలోని దాతలందరిలోకెల్లా పిన్న వయస్కుడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారీగా విరాళాలు ప్రకటించిన వారిలో టాటాలు ముందున్నారు. పీఎం కేర్స్‌ నిధికి టాటా గ్రూప్‌ రూ.1,500 కోట్లు విరాళమిచ్చింది. ప్రేమ్‌ జీ సైతం రూ.1,125 కోట్లు దానం చేశారు. కాగా, ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రూ.510 కోట్లు - ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.400 కోట్లు ప్రకటించాయి.