Begin typing your search above and press return to search.

రాందేవ్‌ కు అర్థ‌మైంది మోడీకి అర్థం కాలేదే!

By:  Tupaki Desk   |   17 Sep 2018 5:03 AM GMT
రాందేవ్‌ కు అర్థ‌మైంది మోడీకి అర్థం కాలేదే!
X
లీట‌రు పెట్రోల్.. డీజిల్ రూ.35-40కు ఇస్తానంటే? అంత‌కంటే తియ్య‌టి వార్త ఇంకేం ఉంటుంది. చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని రీతిలో భారీగా పెరిగిన పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల‌తో సామాన్యుడి న‌డ్డి విరిగిపోతున్న ప‌రిస్థితి. అన్ని అనుకున్న‌ట్లే జ‌రిగితే లీట‌రు పెట్రోల్ రూ.90 ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసిన ప‌రిస్థితి. ఇదే జోరు కొన‌సాగితే.. మ‌రో మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో లీట‌రు పెట్రోల్ రూ.100కు ట‌చ్ కావ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అంత‌కంత‌కూ పెరుగుతున్న పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌లు మోడీ స‌ర్కారు ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తున్నాయి. ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఈ విష‌యాలు మోడీ ద‌రికి చేరుతున్నాయో కానీ.. పెరిగిన పెట్రో ధ‌ర‌ల‌తో మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీ మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌ని యోగా గురు రాందేవ్ బాబు తాజాగా వార్నింగ్ ఇచ్చారు.

ఒక చాన‌ల్‌ లో పాల్గొన్న ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తానే కానీ ప్ర‌భుత్వంలో ఉంటే పెట్రోల్‌.. డీజిల్ ను రూ.35-40కే ఇచ్చేవాడిన‌ని చెప్ప‌టంతో ఆయ‌న మాట‌లు హాట్ టాపిక్ గా మారాయి. స‌రిగ్గా ఇదే త‌ర‌హా మాట‌ల్ని గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ ప‌రివారం చెప్ప‌టం మ‌ర్చిపోకూడ‌దు.

ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన వారిని.. త‌ప్పు ప‌ట్టిన వారిని కేసుల ఇబ్బందికి గురి చేస్తున్నార‌న్న మాట‌ను స‌ర్వ‌త్రా వినిపిస్తున్న వేళ‌.. వాక్ స్వాతంత్య్రం మీద రాందేవ్ బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వాక్ స్వాతంత్య్రం ప్ర‌జ‌ల ప్రాథ‌మిక హ‌క్కుగా గుర్తు చేయ‌టం గ‌మ‌నార్హం.

గ‌త ఎన్నిక‌ల మాదిరే వచ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున ప్ర‌చారం చేస్తారా? అన్న ప్ర‌శ్నిస్తే.. తానెందుకు ప్ర‌చారం చేయాల‌ని ఎదురు ప్ర‌శ్నించారు. త‌నంత‌ట తానే రాజ‌కీయాల‌కు దూరంగా వ‌చ్చేశాన‌ని చెప్పిన ఆయ‌న‌.. తాను ఏ పార్టీతోనూ లేన‌ని.. అన్ని పార్టీల‌తో ఉంటాన‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షాలు ఒక్కొక్క‌టిగా వైదొలుగుతున్న వేళ‌.. రాందేవ్ లాంటి వారు సైతం దూరం కావ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.